Kerala, Jul 17: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళ,కర్ణాటక,గోవాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లుతుండగా రోడ్లన్ని జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గోవా,కేరళ,కర్ణాటకలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ముఖ్యంగా భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమైంది. నదులు ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాలు నీటమునగగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరియార్ నది వరద ఉధృతికి అళువాలోని మనప్పురం శ్రీ మహాదేవ ఆలయం నీటమునిగింది. మరో 48గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
కన్నూర్, కోజికోడ్, వయనాడ్, పాలక్కాడ్, త్రిస్సూర్, ఇడుక్కి, అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో భారీ వర్షాల కారణంగా 8 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ (IMD) తెలిపింది.
కర్ణాటకలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన రెడ్ అలర్ట్ కారణంగా కార్వార్, అంకోలా, కుమటా, హొన్నావర్, భత్కల్, సిర్సి, సిద్దాపూర్, ఎల్లాపూర్, దండేలి మరియు జోయిడా తాలూకాలలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోవాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో 1వ తరగతి నుండి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శైలేష్ జింగ్డే ప్రకటించారు.