Jaipur, May 3: రాజస్థాన్‌లో రంజాన్‌కు ముందురోజు సోమవారం రాత్రి ఉద్రిక్తకర పరిస్థితులు (Communal Tensions) చోటుచేసుకున్నాయి. జలోరి గేట్ ప్రాంతంలో రెండు మతాలకు చెందిన జెండాలు ఎగరేయడం వివాదానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదరడంతో communal clashes తలెత్తాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి చివరకు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.
వివరాల ప్రకారం.. జోధ్‌పూర్ జిల్లాలోని బాల్‌ముకంద్ బిస్సా సర్కిల్‌లో ఓ వర్గం జెండాలను తొలగించి మరో వర్గానికి చెందిన జెండాలను పాతడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రార్థనల కోసం ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను కొందరు తొలగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారి రెండు వర్గాలు రాళ్లు (Stone-Pelting In Jodhpur Ahead Of Eid) రువ్వుకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల యువకులను చెదరగొట్టారు. ఈ ఘర‍్షణలో కొందరు యువకులు, నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా మంగళవారం రంజాన్ కాగా.. మూడు రోజులపాటు నిర్వహించే పరశురాం జయంతి పండగ కూడా జోధ్‌పూర్‌లో జరుగుతోంది. దీంతో ఇరు మతాలకు చెందినవారూ నగరంలో జెండాలను పెట్టారని సమాచారం . ఘటనా స్థలంలో జనసందోహాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం వేకువజామున కొంతమంది అల్లరి మూకలు స్థానిక పోలీస్ పోస్ట్‌పై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో నలుగురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.
దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ మొత్తంలో పోలీసు బలగాలను ఇక్కడ మోహరించారు. ఇక్కడి పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. పోలీసు రక్షణ మధ్య జోధ్‌పూర్ Ramzan prayers జరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్చగా జిల్లాలో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాను, మొబైల్ డేటాతో పాటుగా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు ( Internet Suspended) అధికారులు తెలిపారు.
జోధ్‌పూర్‌కే చెందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శాంతి, సామరస్యాలను పాటించాలని స్థానికులను కోరారు. జోధ్‌పూర్ సాంప్రదాయక ఆప్యాయత, సోదరభావాన్ని గౌరవించి అన్ని వర్గాలవారు శాంతిని నెలకొల్పాలని విన్నవించారు. అందరూ సహకరించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దేశంలో మత ఘర్షణలు పెరిగిపోతున్నాయి. రంజాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ జోధ్‌పూర్ అల్లర్లు జరగడం గమనార్హం. కాగా ఇటివల ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలో మతఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.