జైపూర్, జూలై 24: రాజస్థాన్‌లోని మాతా కా థాన్ పరిసరాల్లో శనివారం పోలీసులు తన భార్యను చంపిన వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలు మాజీ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) మహిళా మోర్చా అధ్యక్షురాలు. నిందితుడు తలుపులు వేసుకుని రాత్రంతా భార్య మృతదేహం పక్కనే కూర్చున్నాడు. శనివారం మధ్యాహ్నం పోలీసులు రాగానే తలుపులు తెరిచాడు. రమేష్ బెనివాల్ (35), అతని భార్య సుమన్‌కి పెళ్లయి పదిహేనేళ్లయ్యిందని పోలీసులు తెలిపారు
వారి ఇద్దరు పిల్లలు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. కలప వ్యాపారం చేసే రమేశ్ వ్యాపారం నిమిత్తం అతను తరచూ జోధ్‌పూర్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి కూడా జోధ్‌పూర్ వెళ్లి లేట్ నైట్ ఇంటికివచ్చాడు. భార్యను భోజనం వడ్డించమని అడగ్గా ఆమె నిరాకరించింది. దాంతో ఆగ్రహించిన రమేశ్ ఇంట్లో బండరాయితో ఆమె తలపై కొట్టాడు.
ఆ రాయి తలకు బలంగా తగలడంతో సుమన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య హత్య అనంతరం ఇంటి తలుపులు మూసేసిన రమేశ్.. తన బావమరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అతను తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటికి వచ్చే వరకు రమేశ్ లోపలి నుంచి డోర్ లాక్ చేసుకుని భార్య మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సుమన్ బేనీవాల్ రాజకీయాల్లో రాకముందు ఓ గ్యాస్ స్టేషన్‌లో ఉద్యోగం చేసేదని స్థానికులు చెబుతున్నారు.