Jaipur, AUG 05: రాజస్థాన్‌లో (Rajasthan) దారుణం జరిగింది. పూజలో కూర్చున్న బాలిక...తన మేనకోడలి తలను నరికేసింది. ఏదో ఆవహంచినట్లు ప్రవర్తిస్తూ...కత్తితో బాలిక తలపై వేటు (beheaded) వేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని దుంగార్పూర్ (Dungarpur) జిల్లా జిజావఫల గ్రామంలో జరిగింది. దేవతా పూజలో పాల్గొన్న బాలిక వింతగా ప్రవర్తించింది. ఏదో శక్తి ఆవహించినట్లు.. దేవతా విగ్రహం వద్ద ఉన్న కత్తి తీసుకుని అక్కడి వారిపై దాడి చేసింది. మేనకోడలు వరుసైన చిన్నారి తల (beheaded) నరికింది. హరియాళీ అమావాస్యను పురస్కరించుకుని ఈ గిరిజన గ్రామంలో ‘దశ మాత పూజ’ (Dasha matha pooja) నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతా విగ్రహానికి పది రోజులు పూజలు చేస్తారు. పదో రోజున దేవతా విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కాగా, ఒక ఇంట్లో దేవతా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.
గత మూడు రోజులుగా ఆ పూజల్లో పాల్గొన్న 14 ఏళ్ల బాలిక సోమవారం వింతగా ప్రవర్తించింది. ఆమెను ఏదో అదృశ్య శక్తి ఆవహించినట్లుగా ఊగిపోయింది. అమ్మవారు పూనినట్లుగా మాట్లాడుతూ విగ్రహం వద్ద ఉన్న కత్తిని ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకుంది. తన తల్లిదండ్రులతో సహా అక్కడున్న వారిపై ఆ కత్తిని దూసింది. ఏడేళ్ల వయసున్న మేనకోడలు (niece) వర్షా తల నరికింది. దీంతో ఆ గదిలో ఉన్న ఆమె తల్లిదండ్రులతో సహా అంతా భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. కత్తి దూయడంతో ఆ బాలిక తల్లిదండ్రులు కూడా గాయపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలికను అరెస్ట్ చేశారు. పదో తరగతి చదువుతున్న ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ బాలిక ఎందుకు అలా ప్రవర్తించిందో అన్నది అడిగి తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆమెపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.