Rajkot, November 27: గుజరాత్‌లో తీవ్ర విషాదం (Rajkot Fire) చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు కరోనా పేషెంట్లు అగ్నికి ఆహుతి అయ్యారు. మాద్వీ ప్రాంతంలోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో సుమారు 33 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు (Blaze Breaks Out at COVID-19 Dedicated Hospital) అంటుకున్నాయి.
దీంతో పేషెంట్లు హాహాకారాలు చేయడంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న రక్షణ బృందం ఐసీయూలోని ఆరుగురు పేషెంట్లను మాత్రమే సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. మిగతా ఐదుగురు అగ్నికి ఆహుతి అయ్యారు. కాగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న రాజ్‌కోట్ అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో అగ్నిప్రమాద మృతులకు ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని గుజరాత్ సీఎం అధికారులను ఆదేశించారు.