Narendra Mehta (Photo Credits: IANS)

Mumbai, Feb 29: మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. నరేంద్ర మెహతా (Narendra Mehta) తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఓ మహిళా మున్సిపల్ కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.

ముంబై నగరానికి చెందిన పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని థానే జిల్లా బయందర్ మహిళా కార్పొరేటర్ (BJP woman municipal corporator) ఆరోపణలు చేశారు. నరేంద్ర మెహతా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి గీతాజైన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

మహిళా కార్పొరేటర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాలు (BJP Former MLA Narendra Mehta) కలిసి అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. పోలీసులు నరేంద్ర మెహతాపై ఐపీసీ సెక్షన్ 376(2), 496, 417, 323, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలి ఫిర్యాదుతో నరేంద్ర మెహతాతో పాటు ఆయన సన్నిహితుడు సంజయ్ పైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రేప్, అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నరేంద్ర మెహతా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

1999 నుంచి తనను, తన కుటుంబసభ్యులను నరేంద్ర మెహతా వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. దీనిపై శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ తీవ్రంగా స్పందించారు. వెంటనే నరేంద్ర మెహతాను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమం, రక్షణ గురించి గళమెత్తే బీజేపీ లాంటి పార్టీలో ఇలాంటి కీచకుడు ఉండటం విచారకరం అన్నారు. ఇదిలా ఉంటే నరేంద్ర మెహతా మూడు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు.