ముంబై, అక్టోబర్ 10: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా భౌతికకాయాన్ని గురువారం ఉదయం 10:30 గంటలకు ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సిపిఎ లాన్స్‌లో ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతామని టాటా ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 4 గంటలకు అంతిమ యాత్రలో భౌతికకాయాన్ని తీసుకువెళ్లనున్నారు.
మేము ప్రజల సభ్యులను గేట్ 3 నుండి NCPA లాన్‌లోకి ప్రవేశించమని అభ్యర్థిస్తున్నాం. నిష్క్రమణ గేట్ 2 వద్ద ఉంటుంది. ప్రాంగణంలో పార్కింగ్ అందుబాటులో ఉండదు. సాయంత్రం 4 గంటలకు అంతిమ యాత్రను ప్రారంభమవుతుంది. వర్లీలోని డాక్టర్ ఇ మోసెస్ రోడ్‌లోని వర్లీ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని అని ప్రకటన పేర్కొంది. NCPA లాన్‌లకు వెళ్లే రహదారిని పోలీసులు చుట్టుముట్టడంతో ఒబెరాయ్ హోటల్ దాటి మెరైన్ డ్రైవ్ రోడ్డు మూసివేయబడింది.
రతన్ టాటా లాస్ట్ ట్వీట్ ఇదే..నా గురించి ఆలోచిస్తున్న మీకు ధన్యవాదాలు అంటూ..
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ఆయన గౌరవ సూచికంగా గురువారం సంతాప దినంగా ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని చెప్పారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.
Here's Video
#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata kept at NCPA lawns for the public to pay their last respects pic.twitter.com/9YlcsHgo1u
— ANI (@ANI) October 10, 2024
భారత ప్రభుత్వం తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. రతన్ టాటా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దాదాపు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు సంతాపం తెలిపారు.
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 8వ తరగతి వరకు ముంబైలోని కాంపియన్ స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో, శిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లోనూ చదివారు.1955లో న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చేరి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ పూర్తిచేశారు.
అదే ఏడాది టాటా గ్రూప్‌లో చేరారు.
తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎంప్రెస్ మిల్స్‌కు మారారు. 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఉన్నారు. మళ్లీ అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు.
గుండుసూది నుంచి విమానాల వరకు అన్ని రంగాలకు టాటా సామ్రాజ్యాన్ని విస్తరించిన రతన్ టాటా అవివాహితుడు. ముంబైలోని అత్యంత చిన్న ఇంట్లో ఆయన నివసించేవారు. తన టాటా సెడాన్ కారునే నడిపేవారు. మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతోపాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు.
రతన్ టాటా సేవా గుణంలో అత్యున్నతుడు. 1970లలోనే సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆయన టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సేవా కార్యక్రమాలను మరింత విస్తరించారు. కరోనా మహమ్మారిపై పోరు కోసం రూ.1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు.