
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును ఎటువంటి మార్పులు లేకుండా 5.5 శాతం వద్దే కొనసాగించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన రేట్లు అవసరమని స్పష్టం చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఐదో సమావేశం. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును చేశారు. ఇక ఏప్రిల్‌లో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా, జూన్‌లో 50 బేసిస్ పాయింట్ల భారీ కోత విధించారు. ఆగస్టులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఫలితంగా మూడు దశల తగ్గింపుల అనంతరం రెపో రేటు 5.5 శాతానికి చేరుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో కొనసాగిస్తూ RBI స్థిరత్వాన్ని కాపాడే దిశగా అడుగులు వేసింది.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటమే. రిటైల్ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం ఆరేళ్ల కనిష్ట స్థాయిలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తే మార్కెట్‌లో డబ్బు ప్రవాహం పెరిగి తిరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుంది. మరోవైపు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితులు, అమెరికా విధించిన సుంకాల ప్రభావం భారత ఎగుమతులపై పడుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఎలా ఉంటాయో చూసి ముందడుగు వేయాలని RBI నిర్ణయించుకుంది. అదేవిధంగా జీఎస్టీ శ్లాబుల పునర్వ్యవస్థీకరణ వలన తాత్కాలిక అంతరాయాలు రావచ్చని అంచనా వేసింది. అందువల్ల ప్రస్తుతానికి స్థిరత్వమే మేలని RBI భావించింది.
రెపో రేటు అంటే RBI వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. దీని పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు ప్రభుత్వ బాండ్లు లేదా ఇతర అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మి RBI నుంచి రుణం పొందుతాయి. తరువాత ఆ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేస్తాయి. ఈ ప్రక్రియలో వసూలు అయ్యే వడ్డీనే రెపో రేటు అని పిలుస్తారు. మార్కెట్‌లో డబ్బు లభ్యతను నియంత్రించడానికి RBI దీనిని ముఖ్యమైన ఆయుధంగా ఉపయోగిస్తుంది.
రెపో రేటు తగ్గితే బ్యాంకులు తక్కువ ఖర్చుతో రుణాలు తెచ్చుకుని వినియోగదారులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తాయి. దీంతో గృహ రుణాలు, వాహన రుణాలు, కార్పొరేట్ రుణాలు తీసుకునే వారికి EMIలు తగ్గుతాయి. మరోవైపు రెపో రేటు పెరిగితే అప్పు ఖరీదు అవుతుంది. బ్యాంకులు రుణాలపై వడ్డీ పెంచుతాయి. వినియోగదారులపై EMI భారమవుతుంది. అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం RBI తీసుకున్న నిర్ణయం వల్ల రుణాల EMIలు యథాతథంగా కొనసాగుతాయి. వడ్డీరేట్ల తగ్గింపు కోసం ఎదురు చూసే వారికి నిరాశ కలిగించినా, ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా ఈ నిర్ణయం అవసరమే. ఇప్పటికే మూడు దశల తగ్గింపులు జరిగి రేట్లు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు మళ్లీ తగ్గిస్తే ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అందుకే RBI ఈసారి జాగ్రత్తగా వ్యవహరించింది.