VC Sajjanar Sworn In as Hyderabad Police Commissioner at Banjara Hills

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్‌ను.. మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌ సీపీగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా బదిలీ చేసింది. మంగళవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీవీ ఆనంద్‌ నుంచి విసీ సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించారు.

అంతకు ముందు రోజు వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి (TGSRTC) నాలుగేండ్లపాటు సేవలందించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు నేరుగా సేవలదించే సంస్థను వీడడం ఒకింత బాధగా ఉందని తెలిపారు. ఆర్టీసీ స్టీరింగ్‌ వదిలేసే సమయం వచ్చిందని సజ్జనార్ భావోద్వేగానికి గురయ్యారు. తనకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

అంతకుముందు ఉదయం సజ్జనార్‌ లక్డీకపూర్‌లోని టెలిఫోన్‌ భవన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌ భవన్‌కు బస్సులో ప్రయాణించారు. అనంతరం తన ఎక్స్‌ ఖాతాలోనూ భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ పెట్టారు.

VC Sajjanar Sworn In as Hyderabad Police Commissioner at Banjara Hills

‘నా స్టాప్‌ వచ్చేసింది. ఆర్టీసీకి 4 సంవత్సరాలకు పైగా మార్గదర్శకత్వం వహించిన తర్వాత, ఈ బస్సు నుంచి దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు, కానీ రహదారి ఎల్లప్పుడూ ముందుకే సాగుతుంది. బస్సును పార్‌ చేసి, తదుపరి సవాలు వైపు ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం ఇది’ అని పేర్కొన్నారు.