Srikakulam, SEP 26: ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్‌బుక్ (AP Red Book) అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా నారా లోకేశ్ (Minister Nara Lokesh) మీడియాతో మాట్లాడుతూ.. రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్ ఉండాలన్నదే తమ కూటమి ప్రభుత్వ అభిమతమని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పింఛన్లు, మెగా డీఎస్సీ హామీలు అమలు చేశామని నారా లోకేశ్ తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. పథకాల అమలుపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. జగన్‌లా తాము పారిపోయే వ్యక్తులం కాదని వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై కూడా నారా లోకేశ్ స్పందించారు. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలని అన్నారు. తాము చర్చి, మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. తిరుమలకు వెళ్తా అంటున్న జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన యువగళం పాదయాత్రలో కూడా తిరుమల లడ్డూ నాణ్యత లోపంతో పాటు ఇతర సమస్యలు తన దృష్టికి వచ్చాయని లోకేశ్ అన్నారు. అందుకే అధికారంలోకి రాగానే టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పామని తెలిపారు. తిరుమలలో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామని చెప్పారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.