PIB Press Note: ఎన్‌సిసి అనేది "భిన్నత్వంలో ఏకత్వానికి" ఒక ఉజ్వల ఉదాహరణ అని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అన్నారు. ఈ సంస్థ ఏర్పడినప్పటి నుండి క్రమశిక్షణ, శీలం, సాహస స్ఫూర్తి, ఆదర్శాల విలువలను పెంపొందించడం ద్వారా దేశంలోని యువతను తీర్చిదిద్దడంలో అద్భుతమైన పాత్ర పోషించిందని అన్నారు. వారిలో నిస్వార్థ సేవ పెంపొందించిందని రక్షణ శాఖ సహాయ మంత్రి జనవరి 19న న్యూ ఢిల్లీలోని ఢిల్లీ కాంట్‌లో రిపబ్లిక్ డే క్యాంప్ 2023 NCC క్యాడెట్‌లను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలోని యువతకు ఎన్‌సిసి "ఐక్యత, క్రమశిక్షణ" ప్రతీకగా ఉందని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన దేశభక్తి, లౌకిక విలువలను బలోపేతం చేస్తోందని శ్రీ అజయ్ భట్ నొక్కిచెప్పారు.
ఎన్‌సిసి విస్తరణ షెడ్యూల్ ప్రకారం జరుగుతోందని మంత్రి ఉద్ఘాటించారు. "తన విస్తరణ ప్రణాళికల ద్వారా, ఎన్‌సిసి తీర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో తన కవరేజీని పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది" అని కేంద్ర మంత్రి అన్నారు.
ప్రత్యేక ప్రయత్నాల వల్ల గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు ఎన్‌సిసి పరిధిని పెంచుతుందని, అటువంటి ప్రాంతాల్లో గరిష్టంగా కొత్త రైజింగ్‌లను గుర్తిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లోని యువతకు శక్తినిస్తుంది. దేశ నిర్మాణానికి సహకరించడానికి వారికి అవకాశం ఇస్తుంది" అని ఆయన చెప్పారు.
జాతీయ యువజనోత్సవం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం, నాషా ముక్తి అభియాన్ వంటి సమాజ అభివృద్ధి, సామాజిక సేవా పథకాలలో ఎన్ సి సి క్యాడెట్ల పాత్రను శ్రీ అజయ్ భట్ అభినందించారు.
“వివిధ రాష్ట్రాలలో పౌర పరిపాలనకు సహాయం, స్వచ్ఛ అభియాన్, పునీత్ సాగర్ అభియాన్‌లలో వారి అసాధారణమైన సేవతో సహా విపత్తు సహాయక చర్యలలో ఎన్ సి సి ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. 15 ఆగస్టు 2022న మన గౌరవ ప్రధాని హర్ ఘర్ తిరంగా పిలుపుతో ఎన్ సి సి కృషి అక్షరాలా దేశభక్తితో నిండిన గొప్ప పండుగగా మారింది. మీలో టీమ్ వర్క్, వాల్యూ ఎడ్యుకేషన్‌లో పెంపొందించే తత్వం భవిష్యత్తులో కూడా జాతీయ లక్ష్యాల పట్ల సానుకూలంగా సహకరించేందుకు మిమ్మల్ని ఎల్లప్పుడూ దోహదపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని రక్షణ శాఖ మంత్రి అన్నారు.
అంతకుముందు, ఆర్మీ, నేవీ, వైమానిక దళం ... మూడు విభాగాలకు చెందిన ఒక బృందం ఆకట్టుకునే విధంగా "గార్డ్ ఆఫ్ హానర్"ను అందించింది. అనంతరం ఎన్‌సిసి క్యాడెట్లు చక్కటి బ్యాండ్ ప్రదర్శనను ప్రదర్శించారు. శ్రీ అజయ్ భట్ వివిధ సామాజిక అవగాహన ఇతివృత్తాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వివరిస్తూ ఎన్ సి సి క్యాడెట్‌లు రూపొందించిన ‘ఫ్లాగ్ ఏరియా’ను కూడా సందర్శించారు. క్యాడెట్లు తమ పరిథిలోని సంబంధిత రాష్ట్ర డైరెక్టరేట్ థీమ్‌ల గురించి అతనికి వివరంగా తెలియజేశారు.