Accused Sanjay Roy (Photo Credits: File Photo)

New Delhi, Jan 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీస్‌ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. కోర్టులో ప్రవేశపెట్టిన నిందితుడిని ఉద్దేశించి ‘నీకు శిక్ష పడాలి’ అని న్యాయమూర్తి అన్నారు. శిక్షలను సోమవారం ఖరారు చేస్తామని తెలిపారు.కాగా 2024 ఆగష్టు9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి తర్వాత ఆమెను హత్య చేశారు.

గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న 31 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై హత్యాచార సంఘటన జరిగింది. సివిల్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆగస్ట్‌ 10న అతడ్ని అరెస్ట్‌ చేశారు. కలకతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.ఈ కేసులో 120 మంది సాక్షులను సీబీఐ విచారించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోర్టులో వాదించింది. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో సీల్దాలోని సీబీఐ కోర్టు శనివారం సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది.

బాలికలు సెక్స్ కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదంటూ మండిపాటు

ఈ కేసులో (RG Kar rape-murder case) తనను తప్పుగా ఇరికించారని నిందితుడు సంజయ్‌ రాయ్‌ కోర్టుకు తెలిపాడు. ఈ నేరం తాను చేయలేదని చెప్పాడు. ఈ నేరానికి పాల్పడిన వారిలో ఒక పోలీస్‌ అధికారి కూడా ఉన్నట్లు కోర్టుకు వెల్లడించాడు. తాను ఈ నేరానికి పాల్పడలేదని నిందితుడు సంజయ్‌ రాయ్‌ కోర్టుకు తెలిపాడు. నేరానికి పాల్పడిన వారిని విచారించలేదని ఆరోపించాడు. ‘నన్ను తప్పుగా ఇరికించారు. నేను ఈ నేరం చేయలేదు. హత్యాచారం చేసిన వారిని వదిలివేస్తున్నారు. ఇందులో ఒక ఐపీఎస్ కూడా ఉన్నారు’ అని కోర్టుకు చెప్పాడు.

సంజయ్‌ రాయ్‌పై నమోదైన కేసుల సెక్షన్లు, మోపిన అభియోగాలు, సీబీఐ వాదనల మేరకు దోషిగా తేలిన అతడికి సీబీఐ కోర్టు మరణ శిక్ష విధించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఇక సంజయ్ రాయ్‌ దోషిగా తేలడంపై బాధితురాలి తల్లి స్పందించింది. అతడు ఒక్కడే నిందితుడు కాదని తెలిపింది. నేరానికి పాల్పడిన మిగతా వారిని ఇంకా అరెస్ట్‌ చేయలేదని ఆమె ఆరోపించింది. సంజయ్‌ సహచరులు, ఇతర నేరస్థులను అరెస్ట్‌ చేసి శిక్షించే వరకు న్యాయం కోసం తాము ఎదురు చూస్తామని చెప్పింది.

సంజయ్ దోషి అని జీవసంబంధమైన ఆధారాల ద్వారా నిరూపితమైంది. కోర్టులో విచారణల సమయంలో అతడు మౌనంగా ఉన్నాడు. నా కుమార్తెను హింసించి చంపడంలో అతడి పాత్రను ఇది నిరూపించింది. కానీ అతడు ఒంటరిగా లేడు. ఇతరులను ఇంకా అరెస్టు చేయలేదు. కాబట్టి, మాకు ఇంకా న్యాయం జరుగలేదు’ అని మీడియాతో ఆమె అన్నారు.ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని బాధితురాలి తల్లి తెలిపింది. తాను, తన భర్త జీవించే చివరి రోజు వరకు న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె చెప్పింది.