Nagpur, June 3: ఇటీవల వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై (Varanasi Gyanvapi Row) ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం (Why Look for Shivling in Every Mosque) ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన.
జ్ఞానవాపి అంశం ఎప్పటి నుంచో ఉందని, చరిత్రను మనం మార్చలేమని, నేటి తరానికి చెందిన హిందువులు కానీ ముస్లింలు కానీ ఆ వివాదాన్ని సృష్టించలేదని, ఆ ఘటన ఆ రోజుల్లో జరిగిందని, ఇస్లాం మతం బయట నుంచి వచ్చిందని, ఆ సమయంలో జరిగిన దాడుల్లో దేవస్థానాలను నాశనం చేశారని, భారతీయ స్వాతంత్య్ర కాంక్షమనోబలాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అలా చేశారని మోహన్ భగవత్ అన్నారు. హిందువులు ప్రత్యేకంగా పూజించే అనేక ప్రదేశాల్లో వివాదాలను సృష్టించారని, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఆలోచించరని, నేటి ముస్లింలకు పూర్వీకులు హిందువులే అని, మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు వాళ్లను ఆరోజుల్లో దూరంగా ఉంచారని, అందుకే హిందువులు తమ మతపరమైన ప్రదేశాల రక్షణ కోరుతున్నట్లు భగవత్ వెల్లడించారు.
మన మెదడులో సమస్యలు ఉంటే, ఆ సమస్యలు పెరుగుతూనే ఉంటాయని, కానీ పరస్పర ఒప్పందం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని, మార్గం దొరకని పక్షంలో ప్రజలు కోర్టును ఆశ్రయిస్తారని, ఒకవేళ కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా దాన్ని స్వాగతించాలని భగవత్ తెలిపారు. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, మన న్యాయవ్యవస్థ అత్యున్నతమైందని, ఆ కోర్టు నిర్ణయాలను ప్రశ్నించరాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలని తెలిపారు.
ఎటువంటి రకమైన ఆరాధన పట్ల తమకు భేదభావం లేదన్నారు. అన్ని రకాల మతారాధనలు పవిత్రమైనవన్నారు. కొందరు కొన్ని రకాల ఆరాధనలను దత్తత తీసుకున్నారని, కానీ అవన్నీ మన రుషులు, మునులు, క్షత్రియుల నుంచి వచ్చినవే అన్నారు. మన పూర్వీకులంతా ఒక్కటే అన్నారు. కొన్ని ప్రదేశాల పట్ల ప్రత్యేక భక్తి ఉందని, వాటి గురించి మాట్లాడామని, కానీ ప్రతి రోజు కొత్త విషయాన్ని బయటకు తీసుకురావద్దన్నారు. జ్ఞానవాపి వివాదాన్ని ఎందుకు మరింత విస్తృతం చేయాలని ప్రశ్నించారు. జ్ఞానవాపి పట్ల భక్తిభావం ఉందని, కానీ ప్రతి మసీదులోనూ శివలింగం కోసం వెతకడం సరికాదు అని భగవత్ తెలిపారు.ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్‌పై వాదనలు జులై 4న విననుంది.
జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్‌మహల్‌లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన్‌ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు.