Chennai, Sep 7: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు డీఎంకే మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి.ఉదయనిధి స్టాలిన్ తల నరికిన వ్యక్తికి రివార్డు ప్రకటించిన ఘటనపై నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత, దర్శకుడు సీమాన్ స్పందించారు. ఉదయనిధి తల నరికి వేయాలని చెప్పిన స్వామివారి తల తీసిన వారికి రూ. 100 కోట్లు చెల్లిస్తానని సీమాన్ చెన్నైలో అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి తలపై అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య సన్యాసి 10 కోట్లు ప్రకటించిన సంగతి విదితమే.
సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, ఉదయనిధికి మద్దతు ప్రకటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్
ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తల నరికితే రూ.10 కోట్లిస్తామని ప్రకటించిన అయోధ్య స్వామీజీ తల తీసుకొస్తే తాను రూ.100 కోట్లు చెల్లిస్తానంటూ నామ్ తమిళర్ కట్చి నాయకుడు, ప్రముఖ తమిళ సినీ దర్శకుడు సీమాన్ ప్రకటించారు. ఉదయనిధి విసిరిన బంతితో బీజేపీ నాయకులు చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
ఒకరు ప్రకటించిన అభిప్రాయానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే ప్రజాస్వామ్య పద్ధతి అని, అయితే ఎవరో ఏదో చెప్పారని ఏకంగా తల తీసేస్తా, నరుకుతానని బెదరించడం రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. మనిషి తల నరకుతామని చెబుతున్న వ్యక్తి స్వామీజీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. మరోవైపు, ఉదయనిధిని చెప్పుతో కొట్టినవారికి రూ.10 లక్షలు ఇస్తామంటూ ఏపీలోని విజయవాడలో జనజాగరణ సమితి పేరుతో పోస్టర్లు వెలిశాయి.