New Delhi, August 2: రద్దయిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు కావడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు (SC Issues Notices to All State Governments) జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని 66ఏ సెక్షన్ (Section 66A of IT Act) వినియోగాన్ని రాష్ట్రాలు ఇంకా కొనసాగిస్తుండంపై సమాధానం ఇవ్వాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. అలాగే అన్ని హైకోర్టుల్లోని రిజిస్ట్రార్ జనరల్‌ను కూడా ఆ నోటీసుల్లో భాగం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
న్యాయపరంగా ఈ అంశాన్ని విడిగా పరిశీలిస్తాం. అలాగే ఇది పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇస్తున్నాం’ అంటూ సుప్రీం వెల్లడించింది. కాగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను కొట్టివేసినప్పటికీ దీనిని కొనసాగిస్తుండటంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (ఎన్‌జీఓ) పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తాజా నోటీసులు ఇచ్చింది. రద్దు చేసిన సెక్షన్ 66ఏపై తాము సమగ్ర ఉత్తర్వులు ఇవ్వగానే అన్ని వ్యవహారాలు ఒకేసారి సెటిల్ అవుతాయని ధర్మాసనం పేర్కొంది.
రద్దు చేసిన సెక్షన్‌ను కేవలం పోలీసులు స్టేషన్లలో మాత్రమే కాకండా దేశంలోని ట్రయిల్ కోర్టుల్లోనూ కొనసాగిస్తున్నారంటూ పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, జ్యుడిషియరీగా తాము ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని, అయితే పోలీసులు కూడా ఇందులో ఉన్నందున, రద్దయిన సెక్షన్ కొనసాగించకుండా సరైన ఉత్తర్వులిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.