New Delhi, Sep 17: పెరిగిపోతున్న తీవ్రవాదంతో ప్రపంచ శాంతి అనేది అతిపెద్ద విఘాతంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో (SCO Summit 2021) వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నారు. ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని (PM Narendra Modi) గ్రూపులోని సభ్యులంతా కనెక్టివిటీ, నమ్మకం లాంటి అంశాలపై పరస్పరం పనిచేయాలన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని, అక్కడ రాడికలైజేషన్ (Rising Radicalisation), తీవ్రవాదం పెరగకుండా చూడాల్సిన బాధ్యతను ఎస్సీవో సభ్యులు నిర్వర్తించాలన్నారు. సెంట్రల్ ఏషియా చరిత్రను పరిశీలిస్తే, అక్కడ ప్రగతిశీల సంస్కృతులు, విలువలు సమ్మిళితం అయ్యాయని మోదీ తెలిపారు. కొన్ని శతాబ్ధాల పాటు సూఫిజం ఇక్కడ వర్ధిల్లిందన్నారు. ఆసియా ప్రాంతమంతా అది వ్యాపించిందని, ఇక్కడ ప్రాంతీయ సంస్కృతుల్లో ఆ పద్ధతులను చూడవచ్చు అని ప్రధాని మోదీ తెలిపారు.
సెంట్రల్ ఏషియాలో ఉన్న చారిత్రక వారసత్వాన్ని పరిశీలిస్తే, ఎస్సీవో సభ్యదేశాలు తీవ్రవాదంపై కలిసి పోరోడాల్సి వస్తోందన్నారు. ఇండియాతో పాటు అన్ని ఎస్సీవో సభ్యదేశాల్లో ఇస్లామ్‌తో అనుబంధం కలిగి ఉన్న ఎన్నో ఇన్స్‌టిట్యూషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. షాంఘై సహకార సంస్థ 2001లో ఏర్పాటైంది. కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్థాన్, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. పొరుగు సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.