Bengaluru, March 23: మహిళలపై లైంగిక దాడి విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహం పేరిట మహిళలపై వారి భర్తలు సాగిస్తున్న లైంగిక క్రూరత్వానికి (Sexual Assault on Wife) వివాహమేమీ లైసెన్స్ కాదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పెళ్లి పేరిట పురుషులు తమ భార్యలపై వికృత చేష్టలకు పాల్పడటం అనాగరికమైనదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకున్నంతనే మహిళలు తమకు బానిసలుగా భావిస్తున్న పురుషులు క్రూరమైన చర్యలకు పాల్పడటం సరికాదని కూడా కోర్టు (Karnataka High Court) తేల్చి చెప్పింది.
పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన భర్త తనను లైంగిక బానిసగా చూస్తున్నాడని, తనపై బలవంతంగా లైంగిక చర్యకు (Sexual Assault) పాల్పడుతున్నాడని, అసహజ లైంగిక చర్యలకు బలవంతం చేస్తున్నాడని, తన కుమార్తె ముందే లైంగిక చర్యకు పూనుకుంటున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేనని చెప్పిన కోర్టు.. భార్య తక్కువ, భర్త ఎక్కువ అంటే కుదరదని తేల్చి చెప్పింది. వివాహం అనంతరం మహిళపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడే భర్తల గురించి తామేమీ మాట్లాడటం లేదని చెప్పిన కోర్టు.. పెళ్లి చేసుకుంటేనే భార్యలను ఎలాగైనా చూడొచ్చని భావిస్తున్న భర్తల గురించే చర్చిస్తున్నామని చెప్పింది.
భర్త అయినప్పటికీ మనిషి మనిషే. భర్త అయిన పురుషుడి లైంగిక దాడి దారుణమైన నేరమే. భార్య అయిన మహిళపై భర్త అత్యాచారం కూడా అత్యాచారమే’ అని కోర్టు వ్యాఖ్యానించింది. భార్యపై అత్యాచారానికి ఎలాంటి ప్రత్యేక హక్కును పురుషుడైన భర్తకు వివాహం ఇవ్వదని పేర్కొంది. ‘పురుష అధికారానికి ప్రత్యేక హక్కు లేదా లైసెన్స్‌ను వివాహ వ్యవస్థ ఇవ్వదు, ఇవ్వకూడదు. క్రూరమైన మృగాన్ని శిక్షించకుండా విడిచిపెట్టేందుకు ఎలాంటి వివాహ వ్యవస్థ అనుమతించదు. అనుమతించకూడదు’ అని వ్యాఖ్యానించింది.
కాగా, ప్రస్తుతం భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 37, వివాహంలో లైంగిక కార్యకలాపాలను మినహాయించింది. దీంతో భార్యపై అత్యాచారం నేరానికి సంబంధించిన విచారణ నుంచి భర్తకు ఇది మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను తాము పరిగణలోకి తీసుకోలేదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ‘ఒక పురుషుడు నేరానికి (అత్యాచారం) పాల్పడినట్లయితే, అది భర్త అయినప్పటికీ శిక్ష విధించాల్సిందే’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో భార్యపై లైంగిక దాడికి పాల్పడిన భర్తపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
మరోవైపు తమ తీర్పు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించాలా వద్దా అనే దాని గురించి కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ‘భర్త అయినప్పటికీ, ఆమె సమ్మతికి విరుద్ధంగా లైంగిక వేధింపుల వంటి క్రూరమైన చర్యను అత్యాచారంగా పేర్కొనలేం. అయితే భర్త తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడితే, ఆ భార్య మానసిక స్థితిపై తీవ్రమైన పరిణామాలుంటాయి. మానసికంగా, శారీరకంగా అది ఆమెపై ప్రభావం చూపుతుంది. భర్తల ఇలాంటి చర్యలు భార్యల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ నిశ్శబ్ద గొంతును చట్ట నిర్మాతలు తప్పనిసరిగా వినాలి’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై చట్టసభలే నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.