Bengaluru, Nov 30: ఆస్పత్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో తెలిపే ఘటన ఒకటి కర్ణాటకలో వెలుగు చూసింది. బెంగళూరులోని రాజాజీనగర ఈఎస్‌ఐ ఆస్పత్రి (ESI hospital mortuary) సిబ్బంది నిర్వాకం రెండు కుటుంబాలకు ఇబ్బందితో పాటు ఎనలేని విషాదాన్ని మిగిల్చింది. ఏడాది క్రితం కరోనా (Coronavirus Pandemic) కారణంగా తమ వారిని కోల్పోయిన రెండు కుటుంబాలకు బెంగళూరులోని రాజాజి ఆసుపత్రి నుంచి నేడు ఫోన్ కాల్ వచ్చింది. మీ సంబంధికుల మృతదేహాలు (Dead bodies of 2 Covid patients) ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయని వాటిని తీసుకువెళ్లాలనేది ఈ ఫోన్ కాల్ సారాంశం. దాంతో సదరు కుటుంబ సభ్యులు అయోమయానికి గురి కావడమే కాక అసలు విషయం తెలుసుకుని షాక్‌కి గురయ్యారు.
ఈ ఘటన వివరాల్లోకెళితే.. చామరాజపేటకు చెందిన మహిళ (40), కేపీ అగ్రహారకు చెందిన వ్యక్తి (35)లు 2020 జూలైలో కరోనాతో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజులకే మరణించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొత్తగా మార్చురీని నిర్మించి, పాత మార్చురీని ఉపయోగించడం మానేశారు. పై ఇద్దరి మృతదేహాలు పాత మార్చురీలో ఉన్నట్లు సిబ్బంది ఇటీవల గుర్తించి వారి బంధువులకు తీసుకెళ్లాలని సమాచారం పంపారు. అయితే బీబీఎంపీ రికార్డుల్లో అప్పట్లోనే వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించినట్లు, అంత్యక్రియలు పూర్తయి డెత్ సర్టిఫికెట్ జారీచేసినట్లు ఉంది.
గతేడాది జూలై 2, 2020న మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన సమయంలో మృతదేహాలను అప్పగించాలని అడిగితే ఆస్పత్రి సిబ్బంది ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృభించడంతో ఇవ్వమని చెప్పారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) ఆ మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాం అని కూడా ఆయా బాధిత కుటుంబాలకు తెలియజేసింది.
సదరు బాధిత కుటుంబాలు తాము మొదటగా నమ్మలేదని ఆసుపత్రికి వెళ్తే అసలు విషయం తెలిసిందని అంటున్నారు. దీంతో ఆయా బాధిత కుటుంబాలు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సదరు ఆస్పత్రి ఆధికారులు సిబ్బంది పై చర్యలు తీసుకోవడమే కాక అసలు ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ అమానుషంపై విచారణ చేయాలని మాజీ మంత్రి సురేశ్‌కుమార్ కార్మిక శాఖ మంత్రి శివరామ్ హెబ్బార్‌ను డిమాండ్ చేశారు. నిర్లక్యం వహించిన బీబీఎంపీ, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.