New Delhi, Nov 30: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాల్కర్ హత్యకేసులో (Shraddha Walkar Murder Case) నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు (Polygraph Test) నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని (Aaftab Poonawala Confessed ) అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని (No Remorse) అతను చెప్పాడని పేర్కొన్నారు.
తాను చాలా మంది అమ్మాయిలలో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధను హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు వివరించాడు. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే ప్రవర్తించాడని ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు. అయితే, ఈ టెస్టుకు సంబంధించి తుది నివేదిక ఇంకా రాలేదు.నార్కో టెస్ట్ తర్వాతే పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు రోజు అఫ్తాబ్‌పై కొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అతడ్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. వెంబడించారు. దీంతో పటిష్ఠ భద్రత నడుమ అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు.
చాలా కాలంగా సహజీవనం చేస్తున్న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగుచూసింది. ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది. నార్కో టెస్టు కూడా నిర్వహించేందుకు అనుమతించింది. డిసెంబరు 1 లేదా 5వ తేదీల్లో టెస్టులు నిర్వహించనున్నారు. ఇక ఈ కేసులో శ్రద్ధా డీఎన్‌ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు కూడా ఇంకా రావాల్సి ఉంది. నార్కో టెస్ట్ తర్వాతే పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.