Valsad, SEP 04: ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్ వైశాలి బుర్సాలా మృతి కేసు (Singer Vaishali Bursala) చేధించారు పోలీసులు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని బలవంతం చేసినందుకు వైశాలి స్నేహితురాలే, ఆమెను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా (Valsad), పర్ది తాలూకాలో ‘పర్’ అనే నది దగ్గర ఒక కారులో వైశాలి మృతదేహం కనిపించింది. గత నెల 28న కారు వెనుక సీటులో వైశాలి మృతదేహాన్ని (Vaishali) పోలీసులు కనుక్కున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వైశాలిది హత్యే అనే తేలింది. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. ఈ క్రమంలో వైశాలిని చంపించింది ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన బబిత కౌషిక్ (Babita Kaushik) అని గుర్తించారు. కొంతకాలం క్రితం వైశాలి నుంచి బబిత రూ.25 లక్షలు అప్పుగా తీసుకుంది.
అయితే, ఇటీవల ఆ డబ్బు తిరిగి ఇవ్వమని బబితను అడిగింది వైశాలి. బబిత మాత్రం చాలా రోజులుగా డబ్బు ఇవ్వడం లేదు. దీంతో వైశాలి మరింత ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో డబ్బు తిరిగి ఇవ్వలేని బబిత.. వైశాలిని చంపడం ఒక్కటే దీనికి పరిష్కారం అనుకుంది. ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఒక సుపారీ గ్యాంగ్‌కు రూ.8 లక్షలు ఇచ్చి, వైశాలిని హత్య చేయమని చెప్పింది. హత్య అమలు చేసేందుకు ఒక ప్లాన్ వేసింది.
వైశాలికి డబ్బులు తిరిగి ఇస్తనని చెప్పి, ఒక చోటుకు రమ్మంది. వైశాలి అక్కడికి కారులో చేరుకోగానే, అంతకుముందే అక్కడికి వచ్చి ఉన్న సుపారీ గ్యాంగ్ (Supari gang) ఆమెను హత్య చేసింది. తర్వాత ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి నది దగ్గర వదిలేశారు. సీసీ కెమెరా దృశ్యాలతోపాటు, అనేక కోణాల్లో విచారణ సాగించిన పోలీసులు చివరకు కేసును చేధించారు. కేసు విచారణలో బబిత నేరాన్ని అంగీకరించింది. మిగతా నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నారు. కాగా, ప్రస్తుతం బబిత తొమ్మిది నెలల గర్భిణి కావడం గమనార్హం.