Fire (Representational image) Photo Credits: Flickr)

Patna, Mar 30: బీహార్‌లోని అరేరియాలో ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో  6 మంది పిల్లలు (Six Children Were Burnt Alive) మరణించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషాద సంఘటన పలాసి బ్లాక్‌లోని చాహత్‌పూర్ పంచాయతీలోని కవయ్య గ్రామంలో జరిగింది. ఈ  ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది స్పష్టంగా తెలియడంలేదు. కాగా పిల్లలందరూ పూరి గుడిసెలో మొక్కజొన్నతో (cooking corn) వంట వండుతున్నారని వార్తలు వస్తున్నాయి.

అక్కడి స్థానికుల సమాచారం ప్రకారం.. సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా ఆ నిప్పు కాస్త పూరి గుడిసెపై పడటంతో ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుపోయారు. చివరకు ఆ మంటల్లోనే వారంతా సజీవ దహనమయ్యారు. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశం లేకపోయింది. దీంతో ఆ చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. వారి హాహాకారాలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేశారు.

అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు (Six children were burnt to death) మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే అంతకుముందు రోజే బిహార్‌లో కాముడి దహనం చేస్తుండగా ఆ మంటల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఇద్దరు బాలికలు ఉన్నారు. చనిపోయిన పిల్లలందరూ ఐదు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు వారు. మృతుల్లో మహ్మద్ యునిక్ ఐదేళ్ల కుమారుడు అష్రాఫ్, మిన్హాజ్ ఆరేళ్ల కుమార్తె మున్నీ, మహ్మద్ ఫారూక్ ఐదేళ్ల కుమారుడు బర్కాష్ అలీ, మహ్మద్ మాటిన్ ఐదేళ్ల కుమారుడు అలీ హసన్, మహ్మద్ తన్వీర్ ఐదేళ్ల పాత కుమార్తె ఖుష్యార్, మహ్మద్ మంజూర్‌కు దిల్వర్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

సమాచారం అందుకున్న పలాసి పోలీస్ స్టేషన్‌తో పాటు ఎస్పీ, ఎస్‌డిపిఓ, సదర్ ఎస్‌డిఓ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం అరియారియా సదర్ ఆసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాధాకరమైన సంఘటన తరువాత,  గ్రామంలో నిశ్చబ్దం ఆవహించింది. అక్కడ అంతా గందరగోళం నెలకొని ఉంది. కుటుంబ సభ్యులు షాక్లో ఉన్నారు.