Tamil Nadu Chief Minister MK Stalin. Credits: PTI

Chennai, May 3: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. శ్రీలంక తమిళులకు చేయూత నివ్వాలని అసెంబ్లీలో ఇటీవల చేసిన తీర్మానాన్ని అనుసరించి సీఎం స్టాలిన్‌ (CM MK Stalin) సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు సహాయకాలను పంపనున్నట్లు సీఎం వెల్లడించారు.

అయితే నేరుగా శ్రీలంకకే పంపే అవకాశం లేనందున కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం (Tamil Nadu Government) ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్‌ ద్వారా కేంద్రానికి పంపింది. అలాగే సీఎం స్టాలిన్‌ గతనెల 29వ తేదీన ప్రధాని మోదీకి లేఖ రాయగా కేంద్రం నుంచి అనుమతి లభించింది. దీంతో విదేశాంగ మంత్రి జయశంకర్‌కు సీఎం పూర్తి వివరాలతో కూడిన లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లును ప్రారంభించింది.

రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టండి, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్

40 టన్నుల బియ్యం, 50 టన్నుల పాలపౌడర్, ప్రాణరక్షణకు ఉపయోగపడే రూ.28 కోట్ల విలువైన 137 రకాల మందులు సిద్ధం చేసింది. సుమారు రూ.123 కోట్ల విలువైన ఈ సరుకులను ఢిల్లీకి చేరవేసి అక్కడి నుంచి శ్రీలంకకు పంపడమా లేక చెన్నై నుంచి శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి చేర్చడమా అనే అంశంపై కేంద్రం నుంచి సమాచారం అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ సోమవారం చెన్నైలోని సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సాయానికి అనుమతించిన కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్‌ ధన్యవాదాలు తెలిపారు.

శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం (Sri Lanka Economic Crisis) వల్ల అత్యవసర, నిత్యావసర వస్తువులకు గిరాకీ ఏర్పడింది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక పెట్రోలియం ఉత్పత్తుల పరిస్థితి దుర్భరంగా మారింది. పెట్రోలు, డీజిల్, కిరోసిన్‌ కొనుగోలుకు గంటల తరబడి ప్రజలు క్యూలో ఉంటున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ దొరకడం గగనమైంది. దేశమంతా విద్యుత్‌ కోతలతో అల్లాడుతోంది. విద్యుత్‌ లేని కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు మూసివేస్తున్నారు. ఈ దశలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్‌ సహా మిత్రదేశాలు స్నేహహస్తం అందిస్తున్నాయి.