New Delhi, Oct 29: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో కీలక అంశంపై దృష్టి సారించింది. తప్పుడు ఆరోపణలతో నిర్దోషులు జైలు శిక్ష అనుభవించినప్పుడు వారికి నష్టపరిహారం ఇవ్వాలా? అనే ప్రశ్నపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా ఆలోచిస్తోంది. న్యాయవ్యవస్థలోని పొరపాట్ల కారణంగా నిర్దోషులు జీవితంలో విలువైన సంవత్సరాలను కోల్పోతున్న సందర్భాలు పెరుగుతుండటంతో, ఇలాంటి బాధితులకు పరిహారం చెల్లించే బలమైన విధానం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టి, చట్టపరమైన క్లిష్టతలను అధిగమించేందుకు అటార్నీ జనరల్ (AG), సొలిసిటర్ జనరల్ (SG) నుండి సూచనలు కోరింది. కోర్టు ఈ ప్రక్రియలో న్యాయపరమైన మార్గదర్శకాలు రూపొందించాలనే ఉద్దేశ్యంతో చర్చను విస్తరించింది.
ఈ కేసు నేపథ్యం చూస్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ నిరుపేద వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో తప్పుడు ఆరోపణలతో 12 ఏళ్లపాటు జైలులో గడిపాడు. థానే కోర్టు 2019లో అతనికి మరణశిక్ష విధించగా, దీర్ఘకాలిక విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇటీవల అతన్ని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.అనంతరం తన కోల్పోయిన 12 ఏళ్ల జీవితానికి పరిహారం ఇవ్వాలని బాధితుడు పిటిషన్ దాఖలు చేశాడు.
బాధితుడి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి కేసుల్లో నిర్దోషులు అనుభవించిన జైలు జీవితం వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ప్రభుత్వం తప్పు తీర్పుల వల్ల కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. దీనిపై సుప్రీంకోర్టు ఒక స్థిరమైన విధానం లేదా మార్గదర్శకాలురూపొందించాలని విన్నవించారు. ఈ అంశంపై లా కమిషన్ కూడా గతంలో సిఫార్సులు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ధర్మాసనం ఈ సందర్భంగా గణాంకాలను ప్రస్తావించింది. దేశంలో శిక్ష విధింపుల శాతం కేవలం 54 శాత్ మాత్రమే ఉందని, మిగిలిన కేసుల్లో విచారణ పొరపాట్లు, తప్పుడు సాక్ష్యాలు లేదా దర్యాప్తు లోపాలు కారణంగా నిర్దోషులు బాధపడుతున్నారని పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో వ్యవస్థ తప్పిదాల వల్ల బలిపశువుగా మారినవారికి పరిహారం ఇవ్వడం న్యాయం కాదా? అనే ప్రశ్నను సీరియస్‌గా పరిశీలిస్తోంది.
అదే ధర్మాసనం, మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో మానసిక వైద్య చట్టం – 2017 అమలు అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి (NHRC) బదిలీ చేసింది. సుప్రీంకోర్టు ఈ విచారణ ద్వారా ఒక మైలురాయి తీర్పు ఇచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే, ఇది భవిష్యత్తులో నిర్దోషులు తప్పుడు ఆరోపణల వల్ల కోల్పోయిన జీవితానికి న్యాయం దక్కేలా మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పవచ్చు