Ranchi, Feb 2: జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని..జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court)కు వెళ్లాలని సూచించింది.
హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోరెన్‌ను బుధవారం అరెస్టు చేసింది.ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధం, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని హేమంత్ సొరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు సంజీవ్‌ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.ఈ అంశంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
తొలుత ఆయన జార్ఖండ్ హైకోర్టులో మాజీ సీఎం పిటిషన్ వేశారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి తదితరులు వ్యూహం మార్చి, నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని సోరెన్ తన పిటిషన్లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్‌భవన్‌కు వెళ్తే అక్కడే అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హేమంత్ సొరేన్ తరఫున సుప్రీంకోర్టు విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ సోరెన్ అరెస్టయిన సంగతి చెప్పారు. బుధవారం రాత్రి హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సొరెన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. రాష్ట్ర హైకోర్టులు రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానాలని, ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.
సీఎంగా హేమంత్ సొరెన్ రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్‌లో జేఎంఎం నేత చంపాయి సొరెన్ సారధ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్నది.రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసబాపక్షనేత చంపయ్ సోరెన్‌ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు.