2002 Gujarat Riots Case: 14 మంది దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, స్వరాష్ట్రంలోకి అనుమతి నిషేధం, అధ్యాత్మిక మరియు సమాజ సేవల్లో భాగం అవ్వాలని దోషులకు సుప్రీం ఆదేశం
Supreme Court of India | Photo-IANS)

New Delhi, January 28:  2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో (Gujarat Riots Case) దోషులుగా ఉన్న 14 మందికి సుప్రీంకోర్ట్ మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 'గోద్రా ఘటన' (Godhra Train Burning) తదనంతర పరిణామాలతో గుజరాత్ లోని సర్దార్‌పురా గ్రామంలో 33 మంది ముస్లింలను సజీవదహనం చేసిన కేసులో దోషులుగా ఉన్న వీరంతా జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నారు. ఇంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వీరి పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బొబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు (Supreme Court)  ధర్మాసనం వీరికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే స్వరాష్ట్రమైన గుజరాత్ లోకి వీరికి అనుమతిపై నిషేధం విధించింది. వీరందరికి ఏదైనా పని అప్పజెప్పాలని పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ 14 మందిని రెండు గ్రూపులుగా విభజించిన సుప్రీంకోర్ట్, ఒక గ్రూపు జబల్‌పూర్‌లో, మరో గ్రూప్ ఇండోర్‌లో ఉంటారని పేర్కొంది. బెయిల్‌పై విడుదలయ్యే వీరంతా ఆధ్యాత్మిక సేవ, సమాజ సేవల్లో పాలుపంచుకోవాలని ఆదేశించింది. వారంలో 6 గంటల పాటు సమాజసేవ చేయాలని సూచించింది. వారానికి ఒకసారి స్థానిక పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

అలాగే దోషులు బెయిల్‌ను సద్వినియోగం చేసుకున్నారా, వారి ప్రవర్తన ఎలా ఉంది అనే దానిపై మూడు నెలల తర్వాత రిపోర్ట్ సమర్పించాలని అధికార యంత్రాగానికి సుప్రీం ఆదేశాలు జారీచేసింది.  భైంసాలో హింసాకాండ, ఇరువర్గాలపై ఒకరికొకరు రాళ్ల దాడి, ఇండ్లకు నిప్పు

Update on SC Order

2002, ఫిబ్రవరి 27న గోద్రా పట్టణ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు మంటల్లో దహనమైన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 58 మంది హిందూ కరసేవకులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన హిందూ- ముస్లింల మధ్య మత ఘర్షణలు, అల్లర్లకు దారితీసింది. గోద్రా రైలు దహనం ఘటనకు ప్రతీకారంగా, 2002 మార్చి 1న సర్దార్‌పురా గ్రామంలో ఒక గుంపు,  ముస్లిం ఇండ్లలోకి చొరబడి దాక్కొని ఉన్న ముస్లింలను వెతికివెతికి సజీవ దహనం చేశారు. అనంతరం అల్లర్లు గుజరాత్ రాష్ట్రంలోని అన్ని చోట్లకు పాకాయి.

2002 గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ హింసాకాండలో సుమారు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆనాడు గుజరాత్ రాష్ట్రానికి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే ఈ హింసాకాండకు సంబంధించిన కేసును మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని ఆరోపణలతో ఆ కేసును దర్యాప్తు చేసేందుకు నానావతి-మెహతా కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాతి కాలంలో మోదీకి క్లీన్ చిట్ లభించింది.