
Tuni, Oct 23: కాకినాడ తునిలో బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.కాగా నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్‌రూమ్‌కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి విదితమే. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక(13)ను తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు.ఆమె తన మనవరాలని, ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి తీసుకువెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో ఆ తోట కాపలదారుడు గమనించి నిలదీశాడు. దీంతో.. ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ దబాయించాడు.
ఆ తోట కాపలదారుడు వీడియో తీయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అనంతరం బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
నారాయణరావు అరెస్ట్‌ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే.. నిందితుడు ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు.
అయితే ఈ ఘటనలో నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. నలుగురు పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి రిమాండ్ పేరిట బలవంతంగా సంతకాలు సేకరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చెరువులోకి దూకాడని అంటున్నారు. చనిపోయాడని మాత్రం ఈ ఉదయం 7గం. సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?. అందుకే అనుమానాలు కలుగుతున్నాయి. మా అనుమానాలు నివృత్తి చేయాలంటే.. పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కోసం తరలిస్తుండగా మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరాలు బయటపెట్టాలని నారాయణరావు కొడుకు సురేష్, కోడలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కోమటి చెరువు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణరావుది సూసైడ్ కాదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను పక్కకు లాగేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
తుని పోలీసులు మాత్రం వారి అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడి నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు. అర్ధరాత్రి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వాష్‌రూమ్ వస్తుందని నారాయణరావు అడిగాడు. వెంటనే ఎస్కార్ట్ వాహనం ఆపాం. వర్షం పడుతుండడంతో పోలీసులు పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చీకటి కావడంతో నిందితుడు పోలీసులకు కనిపించలేదు. ఈలోపు నీళ్లలో దూకినట్లు శబ్దం వచ్చిందని సిబ్బంది చెప్పారు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఉదయం వెతికితే మృతదేహం దొరికిందని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.
ఇక తుని మైనర్ బాలిక(13) లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి.. వరుసకు తాతను అవుతానంటూ హాస్టల్ సిబ్బందిని నమ్మించి నారాయణరావు ఆమెను ఐదుసార్లు బయటకు తీసుకెళ్లాడు. బాలికకు తండ్రి లేకపోవడంతో నారాయణరావు చెప్పింది నిజమేనని హాస్టల్ సిబ్బంది నమ్మారు. అలా.. మూడు సార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోసారి తన వెంట తీసుకెళ్లి ఓ తోటలో అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అది గమనించి తోట కాపలాదారు అడ్డుకున్నాడు.
ఆ సమయంలో తాను టీడీపీ నేతనని, తన జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ బెదిరించాడు. ఈలోపు కొందరు వీడియో తీసి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణరావును గుడ్డలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం నారాయణరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసిన రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువులో దూకేశాడని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.