New Delhi, March 8: అత్యాచారానికి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా (Will You Marry Her ) లేక జైలుకు వెళ్తావా అంటూ సుప్రీంకోర్టు మహారాష్ట్రలో జరిగిన ఓ అత్యాచార కేసులో నిందితుడిని ప్రశ్నించిన సంగతి విదితమే. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి జస్టిస్ బొబ్డే ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అలా అడగడం వెనుక కేసులోని వాస్తవాలలో ఉన్నాయని, అయితే మీడియాలో తప్పుగా నివేదించడం జరిగిందని బొబ్డే అభిప్రాయపడ్డారు. ఒక సంస్థగా సుప్రీంకోర్టుకు ఎల్లప్పుడూ స్త్రీత్వంపై అత్యున్నత గౌరవం ఉన్నదని చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే సోమవారం అన్నారు.
కాగా గత వారం లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని ఫిర్యాదుదారును వివాహనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అంటూ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించినట్లు అన్ని మీడియాలో వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. ‘ఒక సంస్థగా, ఈ కోర్టులోని ధర్మాసనానికి మహిళలు అంటే అత్యన్నత గౌరవం ఉన్నది. మహిళలను సుప్రీంకోర్టు ఎప్పుడూ సముచితంగా గౌరవిస్తున్నది. ఫిర్యాదుదారును వివాహం చేసుకోవాలని నిందితుడిని నేను అడగలేదు. అయితే, ఆమెను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అని మాత్రమే ప్రశ్నించాం. అసలు విషయాలు ఇలా ఉండగా మీడియాలో అందుకు విరుద్ధంగా వార్తలు ప్రచురితమయ్యాయి’ అని సీజేఐ బొబ్డే పేర్కొన్నారు.
తన వ్యాఖ్యలపై న్యాయవాదుల నుంచి, హక్కుల సంఘాల నుంచి విమర్శలు రావడంతో వివాదంపై జస్టిస్ బొబ్డే స్పందించారు. విచారణ సందర్భంగా హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐకి మద్దతుగా నిలిచారు. మార్చి 1 న విచారణ సందర్భంగా కోర్టు సమర్పించిన సాక్ష్యం ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 165 ప్రకారం పూర్తిగా సమకాలీనంగా ఉన్నదని, ఇది ఒక కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నిందితులను ప్రశ్నించేందుకు న్యాయమూర్తులకు అధికారం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. న్యాయమూర్తులు ఈ కేసులో అలా ప్రశ్నించడం సబబుగానే ఉన్నదని, అయితే వ్యాఖ్యలు సందర్భోచితంగా విస్తృతంగా నివేదించబడ్డాయని మెహతా చెప్పారు.
తన మీద నమోదు అయిన రేప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మహారాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యోగి మోహిత్ సుభాష్ చవాన్ (Mohit Subhash Chavan) పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీజే ఎస్ఏ బోబ్డే ( Chief Justice of India SA Bobde) ఆ కేసు విచారణ సందర్భంగా తీర్పునిస్తూ.. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మేం మీకు హెల్ప్ చేస్తాం, లేదంటే నువ్వు నీ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని, జైలు శిక్ష కూడా పడుతుందని అన్నారు. కాగా స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన మోహిత్‌పై పోక్సో చట్టం నమోదు చేశారు.
అమ్మాయిని మోసం చేసి.. రేప్ చేసిన నీవు.. గవర్నమెంట్ ఉద్యోగి అన్న ఆలోచన లేదా అని సీజే ఆ నిందితుడిని ప్రశ్నించారు. నువ్వు పెళ్లి చేసుకోవాలని మేం వత్తిడి చేయడంలేదు. కానీ నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. ఎందుకంటే మేం వత్తిడి చేస్తున్నామని నువ్వే ఆరోపిస్తావని సీజే అన్నారు. రేప్‌కు గురైన అమ్మాయిని తొలుత నిందితుడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ అప్పుడు ఆమె నిరాకరించింది.
ప్రస్తుతం తనకు మరో పెళ్లి జరిగిందని, అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేనన్నాడు. అరెస్టుకు గురైతే, ఉద్యోగం పోతుందని ఆ నిందితుడు కోర్టు తెలిపారు. నాలుగు వారాల వరకు అరెస్టును నిలిపివేస్తున్నామని ఇవాళ సీజే తన ఆదేశాల్లో పేర్కొన్నారు.ఈలోగా పిటిషనర్ రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మీరు వ్యామోహంలో ఆమెపై అత్యాచారం చేయడానికి ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలని సిజెఐ బొబ్డే పిటిషనర్ తరపున న్యాయవాదికి చురకలంటించారు.