Sex Work as a ‘Profession’: సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయడం నేరం, వారు సెక్స్ వ్యాపారంలో ఇష్టపూర్వకంగా ఉంటే వేధింపులకు పాల్పడరాదు, సెక్స్‌ వర్క్‌‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

New Delhi, May 27: బతుకుదెరువు కోసం శరీరాన్నే సంపాదన మార్గంగా మార్చుకున్న మహిళలకు కాస్త మనోనిబ్బరం కలిగించే రోజులు రానున్నాయి. వారి వృత్తి నేరమేమీ కాదు. తప్పేమైనా ఉంటే వారితో వ్యాపారాలు చేసే బ్రోతల్‌ హౌస్‌లదే. ఇంతవరకు పోలీసు వ్యవస్థ వారితో వ్యవహరించిన తీరులో స్పష్టమైన మార్పు కనిపించనుంది. వ్యభిచారం విషయమై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు కారణం. సెక్స్‌ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. మనుషుల మర్యాదకు కనీస భద్రత కల్పించడం బాధ్యతగా గుర్తించాలని పేర్కొంది. సెక్స్‌ వర్కర్లకు గౌరవం, భద్రత కల్పించడానికి చట్టమేదీ లేదు. అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని పేర్కొంది.

సెక్స్‌ వర్కర్ల హక్కులను పరిరక్షిస్తూ జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం 6 సూచనలు చేసింది. చట్ట ప్రకారం సమాన రక్షణ పొందడానికి సెక్స్‌ వర్కర్లకు అర్హత ఉంది. సెక్స్‌ వర్కర్‌ మేజర్‌ అయి ఉండి, ఇష్టపూర్వకంగా వృత్తి నిర్వహిస్తున్నప్పుడు (Sex Work as a Profession) పోలీసులు జోక్యం చేసుకోకూడదు. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదు. బ్రోతల్‌ హౌస్‌లో ఇష్టపూర్వకంగా జరిపే సెక్స్‌వర్క్‌ చట్టవ్యతిరేకమేమీ కాదు.

ఐఏఎస్ పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ, మా కంటే పెంపుడు కుక్కే ఎక్కువా? అంటూ క్రీడాకారుల ప్రశ్న, వైరల్ గా మారిన ఢిల్లీ ఐఏఎస్ అధికారి నిర్వాకం, తక్షణమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు

అందువల్ల బ్రోతల్‌ హౌస్‌పై రైడ్‌ చేసినప్పుడు సెక్స్‌ వర్కర్ల అరెస్టులు, జరిమానా విధించడం, వేధించడం, ఇతరత్రా బలి చేయడం వంటివి కూడదు. అయితే బ్రోతల్‌ హౌస్‌ను నడపడం మాత్రం చట్టవ్యతిరేకమే. తల్లి సెక్స్‌ వర్క్‌ చేస్తోందన్న కారణం చూపి బిడ్డను ఆమె నుంచి వేరు చేయకూడదు. బ్రోతల్‌ హౌస్‌లో సెక్స్‌ వర్కర్లతో మైనర్లు కలిసి జీవిస్తున్నంత మాత్రాన ఆ పిల్లలను అక్రమ రవాణా ద్వారా తీసుకొచ్చారని భావించడం తగదు. సెక్స్‌ వర్కర్లు ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు వివక్ష చూపకూడదు. ముఖ్యంగా తమపై లైంగికపరమైన దాడి జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మెడికో-లీగల్‌ రక్షణ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి.

టీవీ నటిని దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులు, ఎన్‌కౌంటర్‌లో వారిని మట్టుబెట్టిన జమ్ము పోలీసులు

ఈ విషయంలో పోలీసులకు అవగాహన కలిగించాలి. మీడియా కూడా అత్యంత జాగురూకతతో వ్యవహరించాలి. వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గత పరచకూడదు. ఫొటోలను ప్రచురించడం, టెలికాస్ట్‌ చేయడం వంటివి చేయకూడదు. ఈ సూచనలపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది. సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గావై, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్‌ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.

సెక్స్‌ వర్కర్లను వ్యభిచార కూపం నుంచి రక్షించే సమయంలో.. సెక్స్‌వర్కర్ల ఫొటోలు, గుర్తింపును బయటపెట్టొద్దంటూ కోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చసింది. ఐపీసీ సెక్షన్‌ 354సీ voyeurism (ఇతరులు నగ్నంగా ఉన్నప్పుడు.. శారీరకంగా కలుసుకున్నప్పుడు తొంగి చూడడం లాంటి నేరం) కిందకే వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మీడియాకు జారీ చేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది.