Oxygen Crisis in India: దేశంలో ఆక్సిజన్ కొరత, జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, వారం రోజుల్లోగా టాస్క్‌ఫోర్స్‌ బృందం సేవలు అందుబాటులోకి
Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi, May 8: కరోనావైరస్ సెకండ్ వేవ్ విశ్వరూపం ప్రదర్శిస్తున్న వేళ, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు తీవ్ర డిమాండ్ (Oxygen Crisis in India) ఏర్పడింది. ప్రత్యేక ట్యాంకర్లలో ప్రాణవాయువును రాష్ట్రాలకు తరలిస్తున్నప్పటికీ, అనేక చోట్ల ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు (Supreme Court Sets Up National Task Force) చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ భబతోష్‌ బిశ్వాస్‌, గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌ అండ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌ పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.నరేష్‌ ట్రెహన్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లోని 12 మందిలో వైద్య నిపుణులు, డాక్టర్లు ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యక్తులు భాగం కానున్నారు.

క్యాబినేట్‌ సెక్రటరీ టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఈ బృందం వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ పంపిణీని పర్యవేక్షించనుంది. అంతేకాకుండా కరోనా చికిత్స కోసం అవసరమైన ఔషధాల అందుబాటును, మహమ్మారి కారణంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. ఓ వారం రోజుల్లోగా టాస్క్‌ఫోర్స్‌ బృందం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజన్ అవసరాలను అంచనా వేసి సిఫారసు చేయడం, శాస్త్రీయ పద్ధతిలో మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులకు ప్రత్యేక విధివిధానాలు రూపొందించడం ఈ టాస్క్ ఫోర్స్ విధి.

ఆస్పత్రిలో చేరాలంటే కోవిడ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు, నూతన మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు

ఈ టాస్క్ ఫోర్స్ ఎంతో స్వేచ్ఛగా, విశేష అధికారాలతో పనిచేస్తుందని పేర్కొంది. ప్రస్తుత కొవిడ్ సంక్షోభానికి అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థలు శాస్త్రీయ, ప్రత్యేక విజ్ఞానం ఆధారంగా సత్వరమే స్పందించేలా చేయడమే ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ప్రధాన హేతువు అని ధర్మాసనం వివరించింది. కాగా, ఈ జాతీయ టాస్క్ ఫోర్స్ పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఉప సంఘాలను (సబ్ టాస్క్ ఫోర్స్)లను కూడా ఏర్పాటు చేసుకునే అధికారం కలిగి ఉంటుందని వెల్లడించింది.