Kolkata, March 1:ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, మోదీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. ఉగ్రవాదం కోరలు పీకే విషయంలో ఎన్‌ఎస్‌జీ (National Security Guard) కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు.
కోల్‌కతా సమీపంలోని రాజార్‌హాట్‌లో ఎన్‌ఎస్‌జీ నూతన కాంప్లెక్స్‌ను అమిత్‌షా ఆదివారంనాడు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో శాంతికి భంగం కలిగించి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తుల గుండెల్లో ఎన్‌ఎస్‌జీ ( NSG) గుబులు పుట్టిస్తోందన్నారు. ఇప్పటికీ తమ పన్నాగాలను ఆపకుంటే ఎస్‌ఎస్‌జీనే ఆ శక్తులకు దీటుగా సమాధానమిస్తుందని చెప్పారు.
కలకత్తాలో అమిత్‌షా, గో బ్యాక్ అంటూ వామపక్షాలు, కాంగ్రెస్ నిరసనలు
మెరుపుదాడులు, బాలాకోట్ వైమానిక దాడుల (Balakot Airstrikes) తర్వాత ఆ సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్ సరసన భారత్ చేరిందని హోంశాఖా మంత్రి పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌జీని బలోపేతం చేసేందుకు రాబోయే ఐదేళ్లలో అన్ని వసతులూ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్‌జీని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎన్‌ఎస్‌జీ బాగోగాలు కేంద్రం చూసుకుంటుందని, వారి కుటుంబాల అవసరాలను చూస్తుందని, దళాలకు ఆధునిక సామగ్రి, సాంకేతకత అందిస్తుందని తెలిపారు.
మనం 'ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. గత 10,000 ఏళ్లుగా భారత చరిత్రలో మనం ఎవరిపైనా దాడి చేయలేదు. మన శాంతిని భంగం కలిగించేందుకు ఎవరినీ అనుమతించలేదు. సైనికుల ప్రాణాలతో ఎవరైనా చెలగాటమాడితే మాత్రం వారు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులకు ఎన్‌ఎస్‌జీనే గట్టి సమాధానం ఇస్తుంది' అని అమిత్‌షా అన్నారు.
కలకత్తా వేదికగా మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా అక్రమ చొరబాట్లపై పెద్ద ఎత్తున ఉద్యమించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ.. మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువస్తే వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. కోల్‌కతాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ ఛీఫ్ జేపీ నడ్డాతో పాటు అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మమత బెనర్జీ వ్యవహరిస్తున్నారని.. అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా పోరాడిన దీదీ, సీఏఏను వ్యతిరేకించడమే ఇందుకు ఉదహారణ అని ఆయన అన్నారు.
కమ్యూనిస్టులతో, కాంగ్రెస్‌తో దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి వారితో ఇప్పుడు మమత బెనర్జి చెలిమి చేస్తున్నారని, మోదీని వ్యతిరేకించేందుకు వారంతా ఒక్కటయ్యారని దుయ్యబట్టారు. ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల్ని చాలా ఇబ్బందులు పెట్టారని, సుమారు 40 మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా గుర్తు చేశారు. తప్పుడు కేసులు తమ కార్యకర్తలపై మోపి, అనుమతులు నిరాకరించి తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే తమను మమత బెనర్జీ ఆపలేరని, ప్రజలు తమవైపే ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.