కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మనిషికి అత్యంత నమ్మకమైన నేస్తాలు. అందుకే యజమానులు వాటికి పుట్టినరోజులు జరపడం, సీమంతాలు చేయడం, బారసాలలు నిర్వహించడం చేస్తుంటారు. ఇలాంటి వార్తలు మనం మీడియాలో అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. అయితే, ఎంతో అనుబంధం పెనవేసుకున్న పెంపుడు కుక్కలు దూరమైతే కొందరు తట్టుకోలేరు.
తమిళనాడుకు చెందిన 82 ఏళ్ల ముత్తు కూడా తన పెంపుడు శునకం ( Memory of His Pet Dog Tom) మరణాన్ని భరించలేకపోయారు. ముత్తు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన శివగంగ ప్రాంతంలోని మానమదురైలో నివసిస్తున్నారు. తన పట్ల ఎంతో ప్రేమగా ఉండే టామ్ అనే కుక్కతో ఆయన ఎంతో అనుబంధం పెంచుకున్నారు. 2010 నుంచి ఆ కుక్క ముత్తు కుటుంబంతో పాటే ఉండేది. దాన్ని ముత్తు ఓ పసిబిడ్డలా పెంచారు. అయితే, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో 2021లో టామ్ మరణించింది. దాంతో, ఆయన తల్లడిల్లిపోయారు.
ఈ క్రమంలో ముత్తు తన పెంపుడు కుక్కకు ఆలయం (82-Year-Old Man Builds Temple) నిర్మించారు. అందులో టామ్ ప్రతిమను ప్రతిష్టించారు. అందుకోసం రూ.80 వేలు ఖర్చయింది. పండుగ దినాల్లోనూ, ప్రతి శుక్రవారం నాడు ఆ ఆలయంలో ముత్తు కుటుంబీకులు పూజలు నిర్వహిస్తుంటారు. శివగంగ ప్రాంతంలో ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. అక్కడికి వచ్చినవాళ్లు దీన్ని ఆసక్తిగా తిలకిస్తుంటారు.