Tamil Nadu Rains: తమిళనాడులో పది జిల్లాలకు రెడ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన, వరదలకు వాగుల్ని తలపిస్తున్న చైన్నై రోడ్లు
Chennai Rains (photo-ANI)

Chennai, Jan 9: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్‌, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.

ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో (Chennai Rains) అయితే రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. చెన్నై నగరంలో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణీ, కోస్తాంధ్రకు వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలకు చెన్నై మరోసారి విలవిల

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటం, ఈశాన్య గాలుల ప్రభావంతో తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షాలు మరో వారం రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. గత ఏడాది తమిళనాడులో తీవ్ర వర్షపాతం నమోదైంది, ప్రధానంగా మైచాంగ్ తుఫాను చెన్నైని తాకడంతో కోట్లాది ఆస్తి నష్టం వాటిల్లింది.

వీడియోలు ఇవిగో, బంగాళాఖాతంలో అల్పపీడనం, మళ్లీ తప్పని భారీ వర్షాలు, తమిళనాడులో స్కూల్స్‌ బంద్‌, మరో వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు

అరేబియా, బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలపై చూపించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చల్లని గాలులు విపరీతంగా వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ, ఏపీలో ఆదివారం నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వర్షాలు, గాలుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండటంతో తమిళనాడుకు సరిహద్దులో ఉన్న రాయలసీమ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమైంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ద్రోని ప్రభావం వల్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ప్రకాశం, బాపట్ల, కర్పూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిసింది. తిరుమలలో కొండపై సోమవారం వర్షం దంచికొట్టింది.. దీంతో ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, పార్కులు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బంగాళాఖాతంలో ఇవాళ గంటకు సుమారు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.