తమిళనాడు రాష్ట్రాన్ని (Tamil Nadu) మరోసారి భారీ వర్షాలు (Rain) ముంచెత్తాయి. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షపాతం నమోదయింది. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఈ నేపథ్యంలో చెన్నైకి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.
దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఇక రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.
ఉత్తర కోస్తాలో ఆదివారం తేలికపాటి వర్షాలు పడుతాయని ఐఎండీ చెప్పింది. రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాలో చూస్తే.... ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని పేర్కొంది. రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.