ISRO Scientist Tapan Misra: ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తపై విష ప్రయోగం, దోశ, చట్నీలో విషపూరిత రసాయనం కలిపారంటూ తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు, Long Kept Secret పేరుతో ఫేస్‌బుక్‌లో పోస్ట్
ISRO| (Photo Credits: PTI)

Bengaluru, Jan 6: ఇస్రోకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త (ISRO Scientist Tapan Misra) మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని Long Kept Secret పేరుతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇస్రోలో కలకలం రేపుతున్నాయి. 2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనను చంపేందుకు కుట్ర జరిగినట్లు ఇందులో పేర్కొన్నారు.

ఆరోజు తాను తీసుకున్న దోశ, చట్నీలో విషపూరిత రసాయనాన్ని (Arsenic Trioxide) కలిపారని.. ఈ విష ప్రయోగం జరిగిన తర్వాత శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డానని, చర్మంపై ఆసాధారణ దద్దుర్లు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో చర్మం పెచ్చులుగా ఊడిపోయిందని పోస్టులో తెలిపారు. గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని, ఓ ప్రముఖ రాడార్‌ ఆధారిత ప్రాజెక్టుకు సీనియర్‌ శాస్త్రవేత్తగా ఉన్న నన్ను తొలిగించేందుకే ఈ దాడి చేసి ఉంటారని తెలిపారు.

పిఎస్ఎల్వి-సి 48 ప్రయోగం విజయవంతం, భారత గూఢాచార వ్యవస్థను పటిష్ఠ పరిచే అధునాతన ఉపగ్రహహం రిసాట్ -2 బిఆర్1తో పాటు, 9 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని, ఓ సహోద్యోగి కూడా దీనిపై ముందే తనను అలర్ట్‌ చేసినట్లు మిశ్రా అన్నారు. వీరి వల్లే వైద్యులకు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విష ప్రయోగం జరిగిన రెండు, మూడు గంటల్లోనే తాను చనిపోయి ఉండేవాడినని చెప్పారు. ఈ చీకటి నిజాన్ని బయటికి బహిర్గతం చేయవద్దంటూ ఇప్పటికీ తనకు వందలాది మెయిల్స్‌ వస్తున్నాయని తపన్ మిశ్రా అన్నారు.

ఈ ఘటన తరువాత రెండేళ్లుగా తాను ఉంటున్న క్వార్టర్స్‌లో కోబ్రా, క్రైట్ వంటి విషపూరిత పాములు చాలాసార్లు కనిపించాయని..సెక్యురిటీ సిబ్బంది వల్ల అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఇప్పటికీ ఈ విషయం బయటకు రాకుండా కొందరు బెదిరింపులకు దిగుతున్నారని, మానసిక వికలాంగుడైన తన కుమారుడిని లక్క్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి తొలి భారతీయుడు, 2022లో ప్రయోగం, కసిమీదున్నఇస్రో చైర్మెన్ కె శివన్

జూలై 19, 2019న యుఎస్ విశ్వవిద్యాలయంలోని ప్రవాస ప్రొఫెసర్‌ కూడా క్విట్‌ ప్రోకో పద్ధతికి తనతో బేరం ఆడాడని, ఈ విషయం బయటకు రాకుండా చూస్తే తన కుమారుడికి ఓ ప్రముఖ కాలేజీలో అడ్మిషన్‌ కూడా ఇప్పిస్తానని మభ్యపెట్టాడని ఆరోపించారు. అయితే వీటికీ తాను బెదరలేదని, గతేడాది సెప్టెంబర్‌లోనూ తనపై మరోసారి విష ప్రయోగం చేయాలని విఫలయత్నం చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికైనా కేంద్రం దర్యాప్తు చేయాల్సిందిగా తపన్ మిశ్రా అభ్యర్థించారు.

గత కొన్నాళ్లుగా డైరెక్టర్లతో చర్చించినా ఫలితం లేదని, దీని వెనుక దాగున్న కుట్రదారులెవరో ప్రభుత్వమే దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని విఙ్ఞన్తి చేశారు. స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్‌ మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్‌ సలహాదారుగా పనిచేస్తున్నారు. జనవరి చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే తపన్ మిశ్రా ఆరోపణలపై ఇస్రో ఇంకా స్పందించలేదు