CM KCR, Telangana Assembly. | Photo Credits : CMO

Hyderabad, September 19: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు  (Telangana Assembly ) జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో భాగంగా సీఎం కేసీఆర్ (KCR)  పలు అంశాలపై సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ (Singareni Collieries Company)  లాభాలలో 28% కార్మికులకు బోనస్ గా ప్రకటించారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ. 1,00899 నగదు దసరా ఇనాం (కానుక)గా లభించనుంది. ఇది గతేడాది కంటే రూ. 40,530 అదనం. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం అన్నారు. సంస్థలో పనిచేసే ప్రతి కార్మికుడు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్లే ఉత్పత్తి ప్రతీ ఏడాది పెరుగుతూపోతుందని చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 50.47 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, 2019-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో 64.41 మిలియన్ టన్నులకు చేరుకుందని కేసీఆర్ అన్నారు. సింగరేణి కార్మికులు మరియు ఇతర సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేసి సంస్థకు మరిన్ని లాభాలు, విజయాలు చేకూర్చాలని సీఎం ఆకాంక్షించారు.

ఇక తెలంగాణ పోలీసుల పనితీరును కూడా సీఎం మెచ్చుకున్నారు. గత ఆరున్నరేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు పోలీసులు తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమంపై కూడా తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హోంగార్డులకు గౌరవప్రదమైన జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖలో సెలవులు అరుదు, రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తారు. వారి పుణ్యంతోనే ఈరోజు అందరూ సురక్షితంగా ఉండగలుగుతున్నారని తెలిపిన సీఎం వారికి కూడా వారాంతపు సెలవు లేదా ప్రత్యామ్నాయంగా మరేదైనా ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం ఒక స్పెషల్ మెకానిజం ఉండాల్సిందే అని పేర్కొన్నారు. దీనికోసం ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇక పోలీస్ కంట్రోల్ కమాండ్ డిసెంబర్ లేదా జనవరికల్లా పూర్తవుతుందని సీఎం వెల్లడించారు.

ఆ తర్వాత నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ , శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ పాత ఆనకట్ట ద్వారా 7 లక్షల ఎకరాల వరకు సాగునీరు స్థిరీకరణ జరిగిపోయినట్లు సీఎం కేసీఆర్ వివరించారు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రావాల్సి ఉందని ఆయన తెలిపారు. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు, ఇక ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 44 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.