Hyderabad, February 25: రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఏర్పాటు చేసే విందులో (Dinner in honour of US Prez) పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు ఈరోజు దిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలోని తన నివాసంలో జరిగే విందు కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆహ్వానం అందింది.
ట్రంప్ తో విందుకు దేశవ్యాప్తంగా కేవలం 90 నుండి 95 వీఐపీలకు మాత్రమే రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం పంపింది. ఆ జాబితాలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కొంతమంది కేంద్ర మంత్రులకు మాత్రమే చోటు దక్కింది. అలా ఆహ్వానించబడిన వారిలో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, హర్యానా, బీహార్ ముఖ్యమంత్రులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విందులో పాల్గొననున్నారు. అందులో భాగంగా తెలంగాణ మరియు అమెరికాకు సంబంధించిన అంశాలపై డొనాల్డ్ ట్రంప్‌తో క్లుప్తంగా మాట్లాడే అవకాశం ఉంది.
గతంలో 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ సందర్శించారు, ఆ సమయంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఘనమైన సత్కారం మరియు ఆతిథ్యం లభించింది. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెతో సంభాషించారు. ఈరోజు ట్రంప్ తో విందుకు హాజరవుతున్న నేపథ్యంలో ఇవాంకాను మరోసారి కలవడమే కాకుండా మొత్తం ట్రంప్ ఫ్యామిలీని కేసీఆర్ కలవబోతున్నారు.
అంతేకాకుండా ట్రంప్ ఫ్యామిలీ కోసం తెలంగాణ సీఎం ప్రత్యేక కానుకలు అందించనున్నట్లు సమాచారం. ట్రంప్ కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మొమెంటో అందించనున్నారు. ఆయన సతీమణికి మరియు కుమార్తె ఇవాంకాల కోసం పోచంపల్లి, గద్వాల్ లో ప్రత్యేకంగా నేయించిన పట్టు చీరలను బహూకరించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాతి 7-8 మధ్య సమయంలో డిన్నర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక నేటితో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగియనుంది. రాష్ట్రపతి భవన్ లో విందు పూర్తికాగానే, రాత్రి 10 గంటలకు ట్రంప్ అమెరికాకు తిరుగు ప్రయాణం అవనున్నారు.