Karimnagar,Febuary 9: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) గంగాధర మండలం కురిక్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ ( Lorry), టాటా మ్యాజిక్ ఆటో (Tata Ace) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మృతులు కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మృతులు మేకల నర్సయ్య అతని కుమారుడు మేకల బాబు, సొదరుడు బానయ్య, సోదరుని కుమారుడు శేఖర్, మేనల్లుడు ఆటో డ్రైవర్ గడ్డం అంజయ్యగా పోలీసులు గుర్తించారు.
గంగాధర మండలం కురిక్వాల గ్రామం వద్ద శనివారం రాత్రి 11.30 గంటల తర్వాత చోటుచేసుకుంది. గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి టాటాఏస్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై తక్షణమే స్పందించిన స్థానికులు అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
కాగా ఇటీవల బైక్‌పై నుంచి పడి గాయపడ్డ బాబుకు కరీంనగర్ ఆసుపత్రిలో వైద్యం చేయించి ఆటోలో ఇంటికి తీసుకు వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆటో క్యాబిన్‌లో డ్రైవర్ అంజయ్య మృతదేహం ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
వ్యాన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అరగంట పాటు శ్రమించి పోలీసులు బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. ఘటన తర్వాత లారీని వదిలి డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.