Telangana: 'అందుకే చెప్పలేదు' ! కరోనా వ్యక్తి మృతిపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఈటల రాజేంధర్, కరోనా పరీక్షల నిర్వహణపైనా సమాధానం ఇచ్చిన హెల్త్ మినిస్టర్
Telangana Health Minister Etela Rajender | File Photo

Hyderabad, May 21: గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారు, వారిపై ఆరోపణలు చేయటం సరికాదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ అన్నారు. కరోనాతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చెయ్యటానికి ఇతరులు ముందుకురావడం లేదు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం, మున్సిపల్ శాఖ అధికారులు ఆ పని చేస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఓ కరోనా మృతుడి అంత్యక్రియలపై వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల జోక్యం చేసుకుని అసలు కారణాన్ని వివరించారు. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ, ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా ప్రకటన చేస్తోందని చెప్పారు.

కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి తీసుకోకుండా తన భర్త అంత్యక్రియలు ఎలా నిర్వహించారంటూ గాంధీ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ పై మరియు జీహెచ్‌ఎంసీ అధికారులపై మాధవి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తపై ఏవైనా ప్రయోగాలు నిర్వహించారా? జవాబు చెప్పాలంటూ ఆమె నిలదీయడం తీవ్ర సంచలనం రేపింది.

దీనికి, మంత్రి ఈటల రాజేంధర్ స్పందిస్తూ.. కరోనా పాజిటివ్ వచ్చి, ఎవరైనా చనిపోతే మొదట్లో వారి కుటుంబ సభ్యులు సైతం మృతుడ్ని చూడడానికి దగ్గరికి రాలేదు. దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. అమెరికా, ఇటలీ లాంటి దేశాలలో వందలమంది చనిపోతే కుటుంబ సభ్యులు లేకపోతే ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయి.

ఏప్రిల్ 29న వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే పేషంట్ కరోనా పాజిటివ్ తో గాంధీలో చేరారు 24 గంటల లోపే 30వ తేదీన ఆయన చనిపోయారు. దీనితో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బంది పడుతూ గాంధీలో చేరాడు. 1వ తేదీనే అతడు కూడా చనిపోయారు. ఆ సమయానికి అతడి భార్యతో సహా కుటుంబ సభ్యులందరూ ఐసోలేషన్లో ఉన్నారు.

అప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు, ఇంట్లో ఒకరు చనిపోయారు. ఆపై భర్త కూడా చనిపోయారని తన భార్యకి చెప్తే షాక్ కి గురవుతుంది. ఇలాంటి గంభీరమైన సందర్భంలో ఆ విషయం చెప్పకుండా ఉండటమే మంచిదని వారి చుట్టాలు కోరిన నేపథ్యంలో మధుసూధన్ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి, GHMC ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారని మంత్రి వివరించారు.

ఎవరికీ చెప్పకుండా మధుసూదన్ అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించింది అని వస్తున్న ఆరోపణలను మంత్రి ఈటల ఖండించారు. వ్యాధి నుంచి కోలుకుని బయటకి వచ్చిన తర్వాత గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదు అని ఈటల పేర్కొన్నారు.  తెలంగాణలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు, కొత్తగా మరో 5 మరణాలు నమోదు.

ఇక, తెలంగాణ కరోనా పరీక్షలను తక్కువగా నిర్వహిస్తోంది, ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతివ్వడం లేదు, ర్యాపిడ్ యాక్షన్ కిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఉపయోగించడం లేదని వస్తున్న ఆరోపణలను సైతం మంత్రి ఈటల తిప్పికొట్టారు. రాపిడ్ కిట్స్ మీద నమ్మకం లేదని తాము మొదటి నుండీ చెప్తున్నాము, ICMR కూడా అదే చెప్పింది.

కోవిడ్ పరీక్షలు మరియు చికిత్స మొత్తం ప్రభుత్వమే అందిచాలని సీఎం చెప్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పరీక్షలు, చికిత్స అందిస్తున్నాము. ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలితే వారి కుటుంబ సభ్యులను, పాజిటివ్ వ్యక్తి కలిసిన వారందరినీ ట్రేస్ చేసి తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నాం. అవసరం అయితే క్వారంటైన్ చేస్తున్నాము. అప్పుడే లెక్క ఎవరు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు అన్నీ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఇంతటి మెకానిజం ప్రైవేట్ వారి వద్ద ఉండదు, వారు చేయగలరా? అని మంత్రి అన్నారు.

కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేంధర్ స్పష్టం చేశారు.