TS RTC JAC Observes Telangana Bandh Today | (Photo-PTI)

Hyderabad, October 19: కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె (TSRTC Strike) నేటితో 15వ రోజుకు చేరింది. తమ నిరసనలో భాగంగా టీఎస్ ఆర్టీసీ జేఏసీ నేడు తెలంగాణ బంద్ (Telangana Bandh) కు పిలుపునిచ్చింది.. ఈ బంద్ కు వివిధ రాజకీయ పక్షాలు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, రెవెన్యూ మరియు తహసీల్దార్ సంఘాలు మద్ధతు ప్రకటించాయి. వీటికి తోడు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో యూనియన్లు కూడా బంద్ లో పాల్గొననున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో వీరి ప్రభావం హైదరాబాద్ నగరవాసులపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. హైదరాబాదులో సుమారు లక్ష వరకు ఆటోలు తిరుగుతాయి. సమ్మె కారణంగా బస్సులు అరకొరగా తిరుగుతుండటం, ఇతర ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో ప్రజలు పూర్తిగా ఎంఎంటీఎస్, మెట్రో రైల్ పైనే ఆధారపడాల్సి వస్తుంది.

రాష్ట్ర బంద్ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీజేఎస్, జనసేన మరియు వామపక్షాలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఆందోళనలు, ర్యాలీలు చేపట్టనున్నాయి. మరో తెలంగాణ ఉద్యమంలా ఉదృతంగా బంద్ కొనసాగేలా చేస్తామని పలు రాజకీయ పక్షాలు ఇప్పటికే హెచ్చరించాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మరియు కార్మికులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని తమ సమ్మెకు మద్ధతివ్వాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? వివరణాత్మక కథనం

మరోవైపు, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని నిన్ననే హైకోర్ట్ , ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వానికి ఈసారి డెడ్ లైన్ కూడా విధించింది, శనివారం ఉదయం 10:30 గంటల లోపు ఆర్టీసీ కార్పోరేషన్, కార్మికులతో చర్చలు జరపాలని గడువు పెట్టింది. చర్చల సారాంశాన్ని తిరిగి ఈనెల 28న తమకు నివేదించాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కాగా, కార్మికుల బంద్ కాల్ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. నేటి బంద్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎన్ని ఉద్రిక్తలకు దారితీస్తుందో చూడాలి.