Hyderabad, December 3: తెలుగు రాష్ట్రానికి చెందిన న్యాయవాద విద్యార్థిని అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. విదేశాల్లో ఉచితంగా న్యాయవాద విద్యను అభ్యసించే అవకాశాన్ని అందిపుచుకున్నారు. ఆస్ట్రేలియా(Australia)లోని వోలాంగాంగ్ యూనివర్సిటీ(University of Wollongong)లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు తెలంగాణా(Telangana) రాష్ట్రానికి చెందిన స్రష్టవాణి కొల్లి ఎంపికైంది.
ఈ మేరకు దరఖాస్తు పత్రాలను పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు న్యాయవాద విద్యను అభ్యసించేందుకు స్రష్టవాణికి 100శాతం స్కాలర్‌షిప్( RS.53 Lakh Scholarship)ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉచితంగా న్యాయవిద్యను అభ్యసించనుంది. ఈ యూనివర్సిటీ లా విద్యలో ప్రపంచంలోనే 90వ ర్యాంకును కలిగి ఉంది.
ఆస్ట్రేలియాలోని వొలాగాంగ్ యూనివర్సిటీ ప్రతి ఏటా ఛేంజ్ ది వరల్డ్ (Change The World Scholarship) పేరుతో ఉచితంగా ఇద్దరికీ స్కాలర్ షిప్ లను అందిస్తూ ఉంటుంది.ఈ ఏడాది ఇండియా, బంగ్లాదేశ్ (India and Bangladesh)నుంచి ఒక్కొక్కరికి ఉపకార వేతనాలను అందించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రెండు దేశాల్లో న్యాయవాద విద్యలో టాలెంట్ చూపిన ఇద్దరు విద్యార్థులకు యూనివర్సిటీ 100 శాతం స్కాలర్‌షిప్ మంజూరు చేస్తామని ప్రకటించింది.
దీని కోసం దేశ వ్యాప్తంగా లక్షల మంది న్యాయవాద విద్యార్థులు పోటీపడ్డారు. మొత్తం లక్షా 52 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ దాటుకుని తెలుగు అమ్మాయి స్రష్టవాణి కొల్లి ఈ ఉపకార వేతనాన్ని దక్కించుకున్నారు. మొత్తం స్కాలర్ షిప్ విలువ ఆస్ట్రేలియన్ కరెన్సీలో 1.08 lakh audగా ఉంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.53 లక్షలతో సమానం.
బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో స్టడీ పాత్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో యూనివర్సిటీ వివరాలను కన్సల్టెన్సీ ప్రతినిధులు, ఇంటర్నేషనల్ రిక్రూట్‌మెంట్ మేనేజర్ పీటర్ ముర్రే వివరించారు. బెంగళూరులో బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరిన విద్యార్థిని స్రష్టవాణి కొల్లి స్టడీ పాత్ కన్సల్టెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలోని వోలాంగాంగ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం బీఎల్ డిగ్రీ చదివేందుకు దరఖాస్తు చేసుకొన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ప్రస్తుతం స్రష్టవాణి కొల్లి బెంగుళూరులోని రేవా న్యాయ విశ్వవిద్యాలయంలో లాయర్ విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు అరవింద్ కొల్లి, ఆశా కొల్లి. తండ్రి సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తల్లి హౌస్ వైఫ్ గా పనిచేస్తోంది. కాగా స్రష్టవాణి ఇంతకుముందు వైల్డ్ వింగ్స్ పేరుతో ఓ కవితా సంపుటాన్నితీసుకువచ్చింది. ఈ సందర్భంగా స్రష్టవాణి మాట్లాడుతూ విదేశాల్లో న్యాయశాస్త్రం చదవాలనే తన కల నెరవేరిందన్నారు.