North India Cold Wave: చలి దెబ్బకు వణుకుతున్న ఉత్తర భారతం, చలి గుప్పిట్లో చిక్కుకుపోయిన దేశ రాజధాని ఢిల్లీ, పొగమంచుతో ప్రమాదాలు, పొగమంచుకు తోడవుతున్న వాయు కాలుష్యం
Temperatures plunge to below 2 deg C in parts of Delhi; coldest day of season (photo-ANI)

New Delhi, December 30: చలికి ఉత్తర భారతం (North India Cold Wave)వణికిపోతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు (Temperatures) దారుణంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ దాల్‌ సరస్సు గడ్డకడుతున్నది. సరస్సుపై మంచు పలుకలు తేలియాడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)అయితే పూర్తిగా చలి గుప్పిట్లో చిక్కుకుపోయింది. దేశ రాజధానితో పాటు ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ చలి వణికిస్తున్నది. జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉన్నది.

విపరీతమైన చలి, మంచు వల్ల నగరంలో చాలా వరకు నీటి సరఫరా పైప్‌లైన్లు గడ్డకట్టిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 2.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ఈ ఏడాది శీతాకాలంలో అత్యంత చలి రోజుగా శనివారం రికార్డుకెక్కింది. 2013 డిసెంబర్‌ 30న ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1996 డిసెంబర్‌ 11న 2.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మళ్లీ ఇప్పుడు దాదాపు 13 ఏండ్ల తర్వాత ఆ స్థాయిలో చలి పెరుగుతుండటం గమనార్హం.

Here's ANI Tweet

వాతావరణంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందున్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో కనీస వేగంతో కూడా వాహనాలు నడుపలేకపోయారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా హర్యానా రేవరి జిల్లాలోని ఢిల్లీ-జైపూర్‌ రహదారిపై వరుసగా 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరో 12 మంది గాయాలపాలయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం పక్కన ఉన్న పాలం ప్రాంతంలో విపరీతమైన పొగమంచు పడటంతో అక్కడ కనీసం పదడుగుల దూరంలో ఉన్న వ్యక్తులు కూడా ఒకరికొకరు కనిపించని పరిస్థితి నెలకొన్నది.

Here's ANI Tweet

ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం నెలకొంది. అలాగే రైళ్ల రాకపోకలపైనా పొగమంచు ప్రభావం పడింది. పొగమంచు కారణంగా దాదాపు 24 రైళ్లను రెండు నుంచి 5 గంటలు ఆలస్యంగా నడిపినట్టు రైల్వే అధికారులు తెలిపారు.దట్టమైన పొగమంచుకు వాయు కాలుష్యం తోడవడంతో వాతావరణంలో గాలి నాణ్యత క్షీణించిపోయింది. ఇక రాజస్థాన్‌లోనూ చలిగాలులు వణికిస్తున్నాయి. సికార్‌ జిల్లాలోని ఫతేపూర్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి మైనస్‌ 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పంజాబ్‌, హర్యానా, ఒడిశా రాష్ట్రాలు కూడా చలి పులి బారిన పడి విలవిల్లాడుతున్నాయి.