Thief- Representational image. | (Photo Credits: Pixabay)

Mumbai, February 14:  అది ముంబైలో అత్యంత ఖరీదైన మెరైన్‌డ్రైవ్ (Marine Drive) ఏరియా. ఓ వ్యాపారవేత్త విలాసవంతమైన భవనం (Businessman's House) అది. అందులోకి ప్రవేశించిన ఓ దొంగ (Thief) వచ్చిన పనిపూర్తి చేసుకోకుండా, మరోపని ఎత్తుకున్నాడు. దాని ఫలితం, ఏం దోచుకోకుండానే పోలీసులు ఇప్పుడు అతడి బ్యాండ్ బజాయిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సిద్ధాంత్ సబూ ముంబైలోని మెరైన్‌డ్రైవ్‌ ప్రాంతంలోని ఓ భవనంలో మూడో అంతస్థులో కొత్తగా ఒక ఫ్లాట్ కొన్నారు. దాదాపు సంగం వరకు సామాన్లు కొత్త ఇంట్లోకి మార్చారు, అయితే అప్పటికీ కూడా వారి కుటుంబం అదే భవనంలోని వేరే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. కొత్త ఫ్లాట్ లో ఎవరూ లేరనే విషయాన్ని గమనించిన సంజీవ్ వర్మ అనే ఓ పేరుమోసిన దొంగ, మొన్న రాత్రి దోపిడి కోసం ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అటూ ఇటూ స్వేచ్ఛగా తిరుగుతూ కొన్ని వస్తువులను సర్దుకున్నాడు, అదే క్రమంలో ఫ్రిజ్ తెరిచి చూడగా అందులో కొన్ని మద్యం బాటిళ్లు (షాంపైన్) కనిపించాయి.

ఇక అవి బయటకు తీసి ఒక ఫుల్ బాటిల్ ఎత్తేశాడు, అది అయిపోగానే మరో బాటిల్ తెరిచి అందులో సగం (హాఫ్) తాగేశాడు. అనంతరం పక్కనే ఉన్న ఒక సోఫా మీద హాయిగా నిద్రపోయాడు.  గోడకు కన్నం వేసి రూ.487/- దోచుకెళ్లిన చిల్లర దొంగ

గురువారం ఉదయం 6 గంటలకు ఆ భవనంలో ఉండే పనివాళ్లు లేచి చూడగా, ఈ కొత్త ఇంట్లో లైట్లు వెలుగుతున్నట్లు కిటికీల్లోంచి కనిపించింది, అలాగే లోపల కూడా గొళ్లెం పెట్టి ఉంది. దీంతో అనుమానమొచ్చి, తమ యజమానికి విషయం అందిచారు. వెంటనే సిద్ధాంత్ సబూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికి, పోలీసులు చేరుకున్నారు, అందరూ కలిసి తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, మనదొంగ గారు ది గ్రేట్ సంజీవ్ వర్మ అప్పటికీ హాయిగా నిద్రపోతున్నాడు. వెంటనే అతణ్ని తట్టి లేపారు, దొంగ లేచిచూడగానే, ఎదురుగా పోలీసులు, గుంపులుగుంపులుగా జనం హడావిడి చూసి బిత్తరపోయాడు.  బాగున్నారా.. అత్తమ్మా.. అంటూ ఇంట్లోకి వచ్చి నగలు దోచుకెళ్లారు

పోలీసులు అతడిని స్టేషన్ కు తరలించి ఆ దొంగపై దొంగతనంతో పాటు, అక్రమ చొరబాటు, ఇల్లు ధ్వంసం, ఇంట్లో వస్తువుల డ్యామేజీ అంటూ ఓ నాలుగైదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా. దొంగమాత్రం, నేను ఇంట్లో చొరబడి ఉండొచ్చు, కానీ ఒక్క వస్తువు కూడా దొంగతనం చేయలేదు అంటూ జడ్జ్ ఎదుట వాదన వినిపించాడు. కాగా, ఈ ఒక్కచోట కూడా కాకుండా ఇతడి మీద ముంబైలోని పలు ప్రాంతాల్లో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.