Tripura CM Biplab Kumar Deb: పంజాబీలకు బలం ఉంది కాని బుద్ది లేదు, వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన త్రిపుర సీఎం, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదంటూ వివరణ
File image of Tripura CM Biplab Deb. | (Photo Credits: IANS)

Agartala, July 21: జాట్లు, పంజాబీలు శారీరకంగా బలవంతులే గానీ వారికి మెదడు ఎక్కువగా పనిచేయదంటూ త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ డెబ్ (Tripura CM Biplab Kumar Deb) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. తెలివితేటల్లో వారు బెంగాలీలతో పోటీ పడలేరంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ డెబ్ (Biplab Kumar Deb) వెనక్కి​తగ్గారు. పంజాబీలు, జాట్లపై కొందరికున్న అభిప్రాయాలను మాత్రమే తాను తేటతెల్లం చేశానని, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని మంగళవారం ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీదంతా బూటకపు ఇమేజ్, ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించిన రాహుల్ గాంధీ, మోదీ బలమే భారత్‌కు అ​తిపెద్ద బలహీనత అంటూ ఎద్దేవా

పంజాబీలు, జాట్లను చూసి తాను గర్విస్తానని, వారితో కలిసి తన జీవిత పయనం సాగిందని తెలిపారు. ‘ ఈ రెండు వర్గాల్లో నాకు పలువురు స్నేహితులున్నారు..నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించాలని వేడుకుంటున్నా..దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబీ, జాట్‌ సోదరుల పాత్రను నేను ఎప‍్పటికీ గౌరవిస్తుంటా..ఆధునిక భారత నిర్మాణంలో వీరి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం తాను ఎన్నడూ ఊహించబోనని బిప్లాబ్ కుమార్ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

Here's Tripura CM Tweets

అగర్తలా ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిప్లాబ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. దేశంలో ప్రతి వర్గానికీ ఓ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెబుతూ బెంగాలీలు తెలివితేటలకు పెట్టింది పేరని..పంజాబీలు, జాట్లు శారీరకంగా బలంగా ఉన్నా (Punjabis and Jats are physically strong) తెలివితేటల్లో బెంగాలీలకు సరిపోరని బిప్లాబ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

పంజాబీని సర్ధార్‌ అంటారని, వారికి తెలివితేటలు తక్కువగా ఉన్నా చాలా దృఢంగా ఉంటారని వారిని బలంలో ఎవరూ గెలవలేరని, ప్రేమతోనే వారిని జయించాలని అన్నారు. ఇక హరియాణాలో పెద్దసంఖ్యలో ఉండే జాట్లకు తెలివితేటలు తక్కువగా ఉన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జాట్‌తో ఎవరైనా పెట్టుకుంటే అతడు ఇంటి నుంచి తుపాకీతో బయటకు వస్తాడని అన్నారు. బిప్లాబ్ కుమార్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

Here's Randeep Singh Surjewala Tweet

ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా విప్లవ్‌ దేవ్‌, బీజేపీ తీరుపై మండిపడ్డారు. త్రిపుర సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీజేపీ ఆలోచనాధోరణి ఇదేనంటూ దుయ్యబట్టారు. హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ బిప్లాబ్ కుమార్ డెబ్ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ మేరకు.. ‘‘దురదృష్టకరం, సిగ్గుచేటు. బీజేపీ ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ పంజాబ్‌లోని సిక్కు సోదరులను, హర్యానాలోని జాట్‌ సామాజిక వర్గాన్ని అవమానించారు.

వారికి తెలివితేటలు లేవు అన్నారు. నిజానికి బీజేపీ అసలైన ఆలోచనా విధానం ఇదే. ఖట్టార్‌ జీ, దుష్యంత్‌ జీ ఎందుకు మౌనంగా ఉన్నారు. మోదీజీ, నడ్డాజీ ఎక్కడున్నారు? క్షమాపణ కోరాలి. చర్యలు తీసుకోవాలి’’అని రణ్‌దీప్‌ సూర్జేవాలా బీజేపీ అధినాయకత్వం, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.

బిప్లాబ్ కుమార్ డెబ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన ‘మహాభారతంలో ఇంటర్నెట్‌ ఉంది.. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు?.. విద్యావంతులైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలి.. లేదంటే పాన్‌షాప్‌ పెట్టుకోవాలి’ వంటి సూచనలు చేసి విమర్శలపాలయ్యారు.