Agartala, August 8: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌పై (Murder Attempt on Tripura CM) గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ముఖ్యమంత్రిని కారుతో ఢీకొట్టేందుకు యత్నించగా త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గురువారం అగర్తలలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం వాకింగ్‌కు వెళ్లేందుకు తన నివాసం నుంచి బయల్దేరుతుండగా ముగ్గురు దుండగులు కారులో సీఎం భద్రతా వలయాన్ని ఛేదించుకొని వచ్చారు.
భద్రతా సిబ్బంది కారును అడ్డుకొనేందుకు యత్నించినా లాభం లేకపోయింది. కారును గమనించిన ముఖ్యమంత్రి వెంటనే పక్కకు జరిగి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకొని అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు (Three arrested) చేశామని వెల్లడించారు. సీఎం విప్లవ్ దేవ్‌పై హత్యయాత్నానికి (attempting to murder CM Biplab Kumar Deb) ప్రయత్నించిన ముగ్గురూ యువకులేనని, వారి వయసు 25 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందన్నారు. శుక్రవారం కోర్టు వారికి 14 రోజుల జైలుశిక్ష విధించిందని పోలీసులు తెలిపారు.
నిందితులను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పీపీ పాల్ ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. ఆగస్టు 19 వరకు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. రెండు రోజుల పోలీసు కస్టడీకి నిందితులను అప్పగించాలని కోర్టును కోరినా ఇవ్వలేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిద్యుత్ సూత్రధార్ తెలిపారు. జైలుకు వెళ్లి పోలీసులు వారిని ఇంటరాగేట్ చేస్తారని, హత్యాయత్నానికి కారణాలను తెలుసుకుంటారని చెప్పారు.