File images of Telangana Ministers Mahamood Ali - KTR - Talasani | File Photo

Hyderabad, November 29: బుధవారం రాత్రి హైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్య గావింపబడిన 26 ఏళ్ల యువ వెటర్నరీ డాక్టర్ (Young Women Vet) విషాద ఘటన పట్ల టీఎస్ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

'ఆ అమ్మాయి నా బిడ్డ లాంటింది, ఈ ఘటన నాకు తీవ్ర దుఖాన్ని కలిగిస్తుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood Ali) పేర్కొన్నారు. ఈ దారుణానికి కారణమైన వారిని ఉరిశిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఈ ఘటన (Brutal Rape- Murder) దురదృష్టకరం అని తెలిపిన హోంమంత్రి, ఆ యువతి తన సోదరికి కాకుండా 100కి డయల్ చేసి ఉంటే పోలీసులు రక్షించి ఉండేవారని పేర్కొన్నారు. ఎవరైనా హెల్ప్ లైన్ నెంబర్ 100కు డయల్ చేసి సమాచారం అందిస్తే, 3 నిమిషాల్లోనే సహాయం అందుతుంది అని మహమూద్ అలీ వెల్లడించారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ ఐటీ, అర్బన్ డెవెలప్మెంట్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ జంతువులను పోలీసులు పట్టుకొని, కఠినంగా శిక్షిస్తారని తెలిపారు. ఈ కేసును తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని స్పష్టం చేశారు. అలాగే, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే 100కు డయల్ చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

KTR Tweet:

ఇక పశువైద్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. భాదితురాలు తన శాఖలోనే పనిచేసే వైద్యురాలని తెలిపారు. మహిళ కాబట్టి ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు దగ్గర ప్రదేశంలోనే పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసేదని ఆమె సేవలను మంత్రి కొనియాడారు. ఈ ఘటన పట్ల సీఎం కేసీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

అయితే చనిపోయిన ఆ యువతి ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని చెప్పిన తలసాని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం అని తెలిపారు. కుటుంబ సభ్యులు కోరుకుంటే వారింట్లో ఎవరికైనా, స్థాయికి తగినట్లు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామి ఇచ్చారు.

ఈ సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మఖ్తల్ పట్టణానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహ్మద్ (26)  (Driver Mohammed alias Arif)ను పోలీసులు విచారిస్తున్నారు. మరో ముగ్గురు అదే ప్రాంతానికి చెందిన జొల్లు నవీన్ (20), జొల్లు శివ (20) , చింతకుంట చెన్నకేశవులను విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ కేసు ఘటన పట్ల జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) సీరియస్ అయింది. కేసును సుమోటో (Suo motu)గా నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తుంది.