Jayaraj and Bennicks died after beatdown in police custody | (Photo Credits: Twitter)

Chennai, July 2: త‌మిళ‌నాడులో ట్యూటికోరిన్ లోని పోలీసు క‌స్ట‌డీలో తండ్రీకొడుకులు చ‌నిపోయిన ఘ‌ట‌న‌ (Tuticorin Custodial Deaths) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర సీఐడీ పోలీసులు యాక్ష‌న్ తీసుకున్నారు. మొబైల్ షాపు ఓన‌ర్లు జ‌య‌రాజ్‌, బెనిక్స్ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన పోలీసులను అరెస్టు చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. ట్యూటికోరిన్ ఎస్ఐ ర‌ఘు గ‌ణేశ్‌తో పాటు మ‌రో ముగ్గురు పోలీసుల్ని అరెస్టు చేశారు. అవి క్రూర‌మైన హ‌త్య‌లు, తూత్తుకుడి తండ్రీకొడుకులు చనిపోయిన ఘటనపై స్పందించిన రజినీకాంత్, వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్రభుత్వాన్ని కోరిన తలైవార్

అరెస్టు అయిన వారిలో స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ బాల‌కృష్ణ‌, కానిస్టేబుల్ ముత్తురాజ్‌, మురుగ‌న్‌లు ఉన్నారు. ఈ కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం అయిదుగుర్ని (Police Officials) అదుపులోకి తీసుకున్నారు. కాగా క‌స్ట‌డీ డెత్ కేసులో పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకునే ఆధారాలు ఉన్నాయ‌ని ఇటీవ‌ల మ‌ద్రాస్ హైకోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. కేసును సీబీఐకి (CBI) అప్ప‌గించే వ‌ర‌కు .. సీఐడీ (CB-CID) విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు (Lockdown Violations) ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై మొబైల్ షాపు ఓన‌ర్ జ‌య‌రాజ్‌, అత‌ని కుమారుడు బెనిక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రెండు రోజుల క‌స్ట‌డీలో ఉన్న వాళ్లు.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌డుతున్నామ‌ని సీబీ-సీఐడీ ఇన్స్‌పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శంక‌ర్ తెలిపారు. జూన్ 19వ తేదీన జ‌రిగిన సంఘ‌ట‌న‌కు సంబంధించి సీసీటీవీ ఫూటేజ్‌ను కూడా ఇవ్వాల‌ని ఈ కేసులో కోర్టు ఆదేశించింది. క‌స్ట‌డీ డెత్ కేసులో పోలీసుల్ని అరెస్టు చేయ‌డంతో.. ట్యూటికోరిన్ స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.