Twitter Loses Intermediary Status: ట్విట్టర్‌పై భారత్‌లో కేసు నమోదు, ఇప్పటికే చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను ఎత్తివేసిన కేంద్రం, ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ
Twitter logo (Photo courtesy: Twitter)

New Delhi, June 16: ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో (India) గట్టి షాక్‌ తగిలింది. ట్విట‌ర్‌కు ఇండియాలో ఉన్న చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను కేంద్ర ప్ర‌భుత్వం (Center) ఎత్తేసింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ (Twitter) తన ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్‌ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా ఐటీ నిబంధనల ప్రకారం వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్‌ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. అయితే ఇతర సోషల్‌మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించినప్పటికీ ట్విటర్‌ మాత్రం ఈ రూల్స్‌ను పాటించలేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జూన్‌ మెదటివారంలోనే తుది నోటీసులు జారీ చేసింది.

దేశంలో 9 లక్షల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, తాజాగా 62,224 మందికి కరోనా, 95.80శాతానికి పెరిగిన రికవరీ రేటు, కో-విన్ యాప్‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని తెలిపిన కేంద్రం

అయినప్పటికీ ట్విటర్‌ అధికారుల వివరాలను వెల్లడించకపోవడంతో తన ‘మధ్యవర్తి హోదా’ను (Twitter Loses Intermediary Status) కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. కాగా.. భారత్‌లో ఈ హోదా కోల్పోతున్న తొలి సోషల్‌మీడియా ఇదే కావడం గమనార్హం.

అయితే భారత్‌లో అధికారులను నియమించినట్లు ట్విటర్‌ మంగళవారం వెల్లడించింది. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు నిన్న తెలిపింది. ఈ వివరాలన్నీ ఐటీ మంత్రిత్వశాఖకు త్వరలో తెలియజేస్తామని పేర్కొంది.ఇదిలా ఉంటే వెంటనే ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ట్విట‌ర్‌పై తొలి కేసు కూడా న‌మోదైంది. మ‌త‌ప‌ర‌మైన హింస‌ను ప్రోత్స‌హించే ట్వీట్ల కార‌ణంగా ఆ సంస్థ‌పై ఈ కేసు పెట్టారు. ఈ నెల 5న ఓ ముస్లిం వ్య‌క్తిపై దాడికి సంబంధించి ఈ కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు వెల్ల‌డించారు.