Hyderabad: పౌరసత్వం నిరూపించుకోవాలంటూ హైదరాబాదీలకు ఆధార్ అథారిటీ నోటీసులు, తెలంగాణలో 400 మంది ఆధార్ కార్డుల రద్దుకు సిఫారసు, దీనిని సిఎఎతో ముడిపెట్టవద్దని వివరణ ఇచ్చుకున్న ఉడాయ్
Image used for representational purpose | Photo Credits: PTI)

Hyderabad, February 19:  దేశవ్యాప్తంగా అనేక చోట్ల పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్ (NRC) కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న వేళ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా సిఎఎకు వ్యతిరేకంగా నిలిచిన సమయంలో భారత విశిష్ట ప్రాధికారక సంస్థ (UIDAI- Unique Identification Authority of India) హైదరాబాద్ నగరంలో కొంతమందికి నోటీసులు జారీ చేసింది.  127 మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే తగిన ధృవీకరణ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో ఆధార్ కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించింది. నగరంలో నివాసముండే ముగ్గురు వ్యక్తులపై వారిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అలాంటి మరికొంత మందిని గుర్తించిన UIDAI ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.  ఆధార్‌లో ఇకపై బంధుత్వాలు కనిపించవు, కేవలం కేరాఫ్ మాత్రమే

గత ఏడాది కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ధృవపత్రాలతో సుమారు 400 మంది ఆధార్ కార్డులు పొందినట్లు గుర్తించిన ఉడాయ్, వారందరి ఆధార్ అకౌంట్ డీయాక్టివేట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఇందులో మొత్తంలో 100కు పైగా హైదరాబాద్ లోనే ఉండగా, సుమారు 80 కి పైగా పాతబస్తీ వారే కావడం గమనార్హం.

ఉడాయ్ పంపిన నోటీసుల అందుకున్న వారందరూ భారత పౌరసత్వం కలిగి ఉంటే అందుకు తగిన పత్రాలు సమర్పించాలి లేదా వారు భారతీయులు కాకపోతే చట్టబద్ధంగానే దేశంలోకి ప్రవేశించారనే విషయాన్ని నిరూపించుకోవాలి. గురువారం లోగా పత్రాలు సమర్పించకపోయినా, నోడల్ ఆఫీసర్ ఎదుట విచారణకు హాజరుకాలేకపోయినా, వారి ఆధార్ కార్డులు రద్దు చేస్తామని  UIDAI హెచ్చరించింది.

అయితే ఈ నోటీసులు అందుకున్న వారిలో ఒక వ్యక్తి తనకు వచ్చిన నోటీసులను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆపై ఈ వార్త వైరల్ అవడం, అటుపై జాతీయ మీడియా కూడా ఈ వార్తకు ప్రాముఖ్యత కల్పించడంతో సిఎఎ వివాదం మరింత ముదిరింది.

అసలు ఒకరి పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిది? అంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ నేపథ్యంలో ఆధార్ అథారిటీ నేరుగా స్పందించింది. ఇందుకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

UIDAI's Press Note: 

ఆధార్ కార్డ్ అనేది భారత పౌరసత్వాన్ని సూచించే ధృవీకరణ పత్రం కాదు, ఆధార్‌కు మరియు పౌరసత్వ చట్టానికి ముడిపెడుతూ దుష్ప్రచారం చేయడం తగదని ఉడాయ్ పేర్కొంది. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆధార్ కార్డ్ పొందినట్లు పోలీసుల నుంచి మాకు సమాచారం అందింది. అందుకే ఆ 127 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఉడాయ్ స్పష్టం చేసింది. అక్రమ వలసదారులకు ఆధార్ కార్డ్ మంజూరు చేయవద్దని సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు ఉన్నట్లు ఆధార్ అథారిటీ గుర్తుచేసింది.

కాగా, ఇదేక్రమంలో నోటీసులు అందుకున్న వారిపై ఫిబ్రవరి 20న చేపట్టాల్సిన విచారణ, మే 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.