Nizam Funds: పాకిస్థాన్‌పై ఇండియా మరో గెలుపు, నిజాం నిధులు భారత్‌కే చెందుతాయని బ్రిటన్ హైకోర్ట్ తీర్పు, హర్షం వ్యక్తంచేసిన హైదరాబాద్ నిజాం వారసులు
Osman Ali Khan, Asaf Jah VII (1886 - 1967) | (Photo Credits: Getty Images)

London, October 03: నిజాం నిధులు (Nizam Funds) తమవే అంటూ వాదిస్తూ వస్తున్న పాకిస్థాన్‌కు బ్రిటన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా- హైదరాబాద్ నిజాం వారసులకు అనుకూలంగా, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా కోర్ట్ తీర్పువెలువరించింది. 70 ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఇంతకీ ఆ నిధులు ఏంటి?, వివాదం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే 1948వ సంవత్సరంలోకి వెళ్లాల్సిందే.

1948వ సంవత్సరంలో 'హైదరాబాద్ సంస్థాన్' 7వ నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) పాలన ఉన్న కాలంలో నాటి నిజాం సంస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి నవాబ్ మోయిన్ 1 మిలియన్ పౌండ్లను లండన్ లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ (నేడు నాట్ వెస్ట్ బ్యాంకుగా పిలువబడుతుంది) లోని హబీబ్ ఇబ్రహీం రహమతుల్లా పేరుతో గల ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ హబీబ్ ఇబ్రహీం నాడు పాకిస్థాన్ హైకమీషనర్ గా పనిచేశాడు. అయితే ఈ ట్రాన్స్ ఫర్ సక్రమమైంది కాదనీ, తన ఆమోదం లేకుండా ఖజానా నుంచి నగదు బదిలీ జరిగింది అని 7వ నిజాం అప్పట్లో పేర్కొన్నాడు. ఇదే సమయంలో ఇటు పాకిస్థాన్ కూడా ఆ డబ్బు తమదే, ఆయుధాల సరఫరా కోసం బదిలీ చేయబడింది. భారత దేశంలో హైదరాబాద్ విలీనం కూడా అక్రమమే అంటూ పాకిస్థాన్ వాదించింది. దీంతో 'నిజాం ఫండ్' గా ఈ నిధి అప్పట్నించీ ఆ బ్యాంకులో అలాగే ఫ్రీజ్ చేయబడింది. 70 సంవత్సరాల పాటు దీనికి వడ్డీ కలపబడి నేడు 35 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. భారత కరెన్సీ ప్రకారం ప్రస్తుతం రూ. 306 కోట్లకు పైగానే ఉంటుంది.

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసులో పాకిస్థాన్ ఏనాడు తన వాదనలకు తగిన ఆధారాలు చూపలేకపోయింది. ఇదే క్రమంలో నిన్న బుధవారం కూడా ఈ కేసు ధర్మాసనం ముందుకు వచ్చింది. కాగా, నిజాం నిధులు తమకే చెందుతాయని పాకిస్థాన్ వాదనలను బ్రిటన్ హైకోర్ట్ తోసి పుచ్చింది, నిజాం వారసుల వాదనలతో ఏకీభవించిన కోర్ట్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. నిజాం వారసులతో కలిసి భారత ప్రభుత్వం ఈ కేసు వేసింది. నిజాం నిధులు తమ దేశానికే చెందుతాయని భారత్ బలంగా వాదిస్తూ వచ్చింది.

కోర్ట్ తీర్పు అనంతరం 7వ నిజాం వారసులు ప్రిన్స్ ముఖ్రమ్ జా, ముఫఖాం జా హర్షం వ్యక్తం చేశారు.  కోర్ట్ తీర్పు నేపథ్యంలో వెస్ట్ బ్యాంక్ లోని ఫ్రీజ్ చేయబడి ఉన్న ఖాతాలోని నిజాం నిధి ప్రస్తుత విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.306 కోట్లు నిజాం వారసులకు న్యాయబద్ధంగా బదిలీ చేయబడుతుంది.