COVID-19 lockdown in India | (Photo Credits: IANS)

New Delhi, May 30: కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ మే 31తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను (Lockdown 5) పొడిగించింది. అయితే ఈ సారి కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే (Containment Zones) లాక్‌డౌన్‌ ను పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. భారత్‌లో 1,73,763 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే సుమారు 8 వేల పాజిటివ్ కేసులు నమోదు, 11 వేలకు పైగా డిశ్చార్జ్, 4,971 కు పెరిగిన కరోనా మరణాలు

రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన నివేదికలను ఆధారంగా చేసుకుని కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగింది. జూన్‌ 8 నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకోవచ్చని తెలిపింది. ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు హోటల్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, ఇప్పటివరకు 214 కేసులు నమోదు, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ లాక్‌డౌన్ అమలు

కరోనా విజృంభన వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు శనివారం సాయంత్రం లాక్‌డౌన్‌ 5.0 కి సంబంధించి కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.

Here' what the MHA said:

లాక్‌డౌక్‌ నేపథ్యంలో రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు, సినిమా హాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.

ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి చేస్తున్నట్లు నూతన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఇక అంతరాష్ట్ర రవాణాపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే ఇరు రాష్ట్రాల ఒప్పందంతోనే ప్రయాణాలు కొనసాగించాలని తెలిపింది.

దేశవ్యాప్తంగా జూన్‌ 8 నుంచి ఆలయాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత స్కూల్స్‌, కాలేజీలకు అనుమతి ఉంటుందని తెలిపింది. బహిరంగ, పనిప్రదేశాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధించే అధికారం రాష్ట్రాలకే ఇచ్చింది.

జూన్ 8 నుంచి అనుమతి లేనివి..!

సినిమా హాళ్లు, జిమ్‌లు, మెట్రోరైళ్లు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు.

పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, క్లబ్బులకు కూడా అనుమతి లేదు.

రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై త్వరలో నిర్ణయం.

అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు, సినిమాహాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, పార్కులు, ఆడిటోరియంల ప్రారంభంపై ప్రస్తుతానికి అనుమతి లేదు.

జూన్‌ 8 నుంచి అనుమతించేవి ఇవే..!

హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌, ఆతిథ్య సేవలకు గ్రీన్‌సిగ్నల్‌

జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలకు అనుమతి

రాష్ట్రాల మధ్య ప్రజలు, సరుకుల రాకపోకలకు గ్రీన్‌ సిగ్నల్‌

జులైలో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం

అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై అన్ని ఆంక్షలను హోం మంత్రిత్వ శాఖ తొలగించింది.కంటోన్మెంట్ జోన్ల వెలుపల దశలవారిగా ఆంక్షలు సడలిస్తారు. ఆయా రాష్ట్రాలు తమతమ అంచనాల మేరకు ఆంక్షలు లేదా నిషేధ ఆజ్ఞలు అమలు చేయవచ్చు. వ్యక్తులు, సరకుల అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు. ఇందుకు ప్రత్యేక అనుమతి, ఇ-పర్మిట్ల అవసరం లేదు.

అయితే ఏదైనా రాష్ట్రం కానీ, కేంద్ర పాలిత ప్రాంతం కానీ ప్రజారోగ్యం, పరిస్థితుల అంచనాలను బట్టి వ్యక్తుల కదలికలపై నియంత్రణలు అమలు చేయవచ్చు. అయితే, అలాంటి కదలికలకు సంబంధించి విధివిధానాలపై ముందుగా పబ్లిసిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

వివిధ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే తేదీలు పరిస్థితుల అంచనాలను బట్టి నిర్ణయిస్తారు. వీటిలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైల్, సినిమా హాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు ఉన్నాయి. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా విషయిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి.